అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము!
చిలకలగూడ: అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం సృష్టించింది. చిలకలగూడ ఠాణా కానిస్టేబుల్ వెంకటేష్‌నాయక్ ఆ పామును పట్టుకుని ఫ్రెండ్ ఆఫ్ స్నేక్ సొసైటీకి అప్పగించాడు. వివరాలు.. లక్డీకాపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా నివసిస్తున్నారు.
ఆదివా రం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అడిషనల్ డీజీపీ ఇంట్లోకి పాము దూరింది. ఇది గమనించిన ఆ ఇంట్లోని వారు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వారి సమాచారం మేరకు డీజీపీ కార్యాలయం సెక్యూరిటీ అధికారులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌ను పిలిపించారు. అతను అరగంట పాటు శ్రమించి ఆరు అడుగుల పాము (జెర్రిపోతు)ను పట్టుకున్నాడు. దీంతో అడిషనల్ డీజీపీ కుటుంబసభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంగా పామును పట్టుకున్న వెంకటేష్నాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. పట్టుకున్న పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో అడవుల్లో విడిచిపెడతామని వెంకటేష్‌నాయక్ చెప్పాడు.