కన్నీటి విన్నపం..
రోజురోజుకూ కొడుకు ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఏడాది కిందటి వరకు చలాకీగా తిరిగిన కుమారుడు మంచం దిగలేక అవస్థ పడుతుంటే నిస్సహాయులుగా చూడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. దా చుకున్న డబ్బంతా చికిత్సకు మంచులా కరిగిపోతుంటే.. రేపటి రోజును తలచుకుని భయపడుతున్నారు. మరో వైపు తన కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను కనీసం ఓదార్చలేక ఆ యువకుడు కుమిలిపోతున్నాడు. ఉన్నదంతా కోల్పోయి, అప్పులు కూడా పుట్టని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం సమాజం నుంచి సాయం అరి్థస్తోంది. యుక్త వయసులో ఉన్న కొడుకుని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు కాసింత చేయూత కోరుతున్నారు.
రేగిడి: రేగిడి గ్రామానికి చెందిన కురిటి తవిటినాయుడు, బుల్లెమ్మలు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. వీరికి మొదటి కుమారుడు కురిటి లోకేశ్వరరావు, రెండో కుమారుడు బాలకృష్ణ. వీరిలో మొదటి కుమారుడు ఏడాది నుంచి బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నా డు. గత ఏడాది డిసెంబర్లో లోకేశ్వరరావు ఆరో గ్యం బాగోలేదని రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి విశాఖ తీసుకెళ్లాలని సూచించా రు. లోకేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు కొంత డబ్బు అప్పు చేసుకొని విశాఖపట్నం తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బోన్ కేన్సర్‌గా నిర్ధారణ చేశారు. కొడుకును కాపాడుకునేందుకు దాచుకున్న డబ్బుతో పాటు దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు చేసి ఆ తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఉన్న సొమ్ములు అయిపోయాయి.. ఇంకా చికిత్స మిగిలే ఉంది. ఆరోగ్య శ్రీ ద్వారా ఆదుకోవాలని కోరితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు మంచానికే పరి మితమైపోయాడు. చలాకీగా స్నేహితులతో తిరగాల్సిన కుర్రాడు ఇలా దీనావస్థకు చేరడం చూస్తే మనసు చలించిపోతుంది.
దయనీయ స్థితి..
లోకేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. బోన్ కేన్సర్‌తో ఎడమ కాలు పూర్తిగా సహకరించడం లేదు. శరీర భాగాల పనితీరు కూడా మందగించింది. శరీరం అస్థిపంజరంలా మారిపోయింది. నిద్రాహారాలు సరిగ్గా ఉండడం లేదు. ఆ యువకుడిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. తల్లిదండ్రులు మా త్రం అనునిత్యం మంచంపై ఉన్న కొడుకుకి సపర్యలు చేస్తూ కాపాడుకుంటున్నారు.
ఆదుకోవాలని వేడుకోలు..
ప్రస్తుత ప్రభుత్వం తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు కురిటి తవిటినాయుడు, బుల్లెమ్మలు వేడుకుంటున్నారు. వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించే స్థోమత కూడా లేదని అంటున్నారు. చిన్నకొడుకును చదివించుకునేందుకు కష్టం చేసి తెచ్చిన కూలి డబ్బులు కొద్దిపాటి మందులకే సరిపోతున్నాయని వారు బాధపడుతున్నారు. మనసున్న వారు మానవత్వంతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 6304857588. బ్యాంకు అకౌంట్ నంబర్ఏఎన్డీబీ0000932––093210100037889.
ప్రభుత్వం ఆదుకోవాలి
నా బిడ్డను ప్రభుత్వమే ఆదుకోవాలి. బోన్ కేన్సర్‌తో రోజురోజుకీ ఆరోగ్యం పాడైపోతోంది. మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. మనసున్నవారు ఆర్థిక సాయం చేస్తే నా కుమారుడిని బతికించుకుంటాను.
– కురిటి తవిటినాయుడు, రోగి తండ్రి, రేగిడి