‘రికార్డు’ దోశ
హైదరాబాద్: అతి పొడవైన దోశ తయారీకి ఆదివారం హైదరాబాద్ వేదికైంది. సుజనామాల్, హోటల్ దస్పల్లా సంయుక్తంగా కూకట్‌పల్లిలోని సుజనామాల్‌లో రికార్డు దోశ తయారీకి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమానికి సినీ నటి రెజీనా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
29 మంది చెఫ్‌లు 54.9 అడుగుల పొడవైన దోశను తయారు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. 13.69 కేజీల బరువున్న ఈ దోశను చూడడానికి అందరూ ఆసక్తి చూపారు. విజయవాడలో గతంలో వేసిన 38 అడుగుల దోశ రికార్డును కూడా ఈ తాజా దోశ అధిగమించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు ఈ దోశ వివరాలను నమోదు చేసుకున్నారు.