అమెరికాలో మరో భారతీయుడికి ఉన్నత పదవి
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల మేథో సత్తాకు నిదర్శనంగా మరో వ్యక్తి ఉన్నత పదవికి ఎంపికయ్యారు. తులనాత్మక రాజ్యాంగ న్యాయశాస్త్రంలో నిపుణుడైన సుజిత్ చౌదరి(44) కాలిఫోర్నియా యూనివర్సిటీ (బెర్క్లే)లోని స్కూల్ ఆఫ్ లా డీన్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నూతన పదవీ బాధ్యతలను సుజిత్ చౌదరి జూలై 1 నుంచి ఐదేళ్ల పాటు నిర్వహిస్తారు. ఈ మేరకు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్స్‌లర్ క్లౌడే స్టీలే ఒక ప్రకటన జారీ చేశారు.
సుజిత్ చౌదరి న్యాయశాస్త్రంపై పలు పుస్తకాలు రచించారు. తొలుత న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్‌గా చేరిన చౌదరి ఆ తరువాత టొరంటో విశ్వవిద్యాలయంలోని లా స్కూల్లో ఫ్రొఫెసర్ అయ్యారు.