మీనన్‌భాయ్ గాంధీగిరి!
స్ఫూర్తి
‘లగేరహో మున్నాభాయ్’ సినిమా చూశారా? గాంధీగిరితో సంజయ్‌దత్ అన్నీ సాధిస్తుంటాడు. ఆక్రమించుకున్న తన ప్రేయసి ఇంటి తాళాలు ఇవ్వమంటూ విలన్ ఇంటిముందు నిలబడతాడు. అలాంటివి చూసినప్పుడు సినిమాల్లో తప్ప బయట అలా చేస్తారా అనుకుంటాం మనం. కానీ చేస్తారు. ఒకాయన చేస్తున్నాడు. ఒకటీ రెండూ కాదు... నాలుగేళ్లుగా చేస్తున్నాడు.
కేరళకు చెందిన సుకుమారన్ మీనన్ నలభై తొమ్మిదేళ్ల క్రితమే బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఓ డైరీఫామ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తను అప్పుడప్పుడూ దాచిన సొమ్ముతో ఓ స్థలం కొనుక్కున్నారు. అక్కడ ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారు. అయితే ఉన్నట్టుండి కర్ణాటక ప్రభుత్వం ఆ స్థలాన్ని సీజ్ చేసి, బెంగళూరు-మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కారిడార్ ప్రాజెక్టుకు కేటాయించింది. వాళ్లు రాత్రికి రాత్రి వచ్చి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దాంతో మీనన్ దంపతులు రోడ్డున పడ్డారు. అద్దె ఇల్లు వెతుక్కున్నారు. తమకు న్యాయం చేయమంటూ ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎన్నో యేళ్లు ప్రభుత్వోద్యోగిగా సేవలందించిన తనకు ఇలాంటి ఇబ్బంది వచ్చినా పట్టించుకోని ప్రభుత్వంపై మీనన్‌కి కోపం వచ్చింది. అప్పట్నుంచీ గాంధీగిరీ మొదలుపెట్టారు. నాలుగేళ్లుగా రోజూ ఉదయం 8 గంటలకు వచ్చి ఎం.జి.రోడ్డులోని పార్కు బయట ఉన్న బెంచీ మీద కూర్చుంటారు.
సాయంత్రం ఆరు గంటల వరకూ అలానే కూర్చుని వెళ్తారు. నినాదాలు చేయరు. ప్లకార్డులు పట్టుకోరు. మౌనంగా నిరసన ప్రకటించి వెళ్తారంతే! మౌనంగా ఉంటే పని అవుతుందా అంటే... ‘‘మాట్లాడాల్సింది నేను కాదు... ప్రభుత్వం’’ అంటారాయన. ఓ 75 యేళ్ల వ్యక్తి నాలుగేళ్లుగా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా... ఇంతవరకూ ప్రభుత్వం స్పందించలేదంటే ఏమనాలి!!