ప్రాణాలర్పించైనా ఎన్ఏడీని అడ్డుకుంటాం..
నేవల్ ఆర్మ్డ్ డిపో వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సుమల గోవింద్
దత్తిరాజేరు : ప్రాణాలర్పించైనా ఎన్ఏడీని అడ్డుకుంటామని పాచలవలస మాజీ సర్పంచ్, ఎన్ఏడీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సుమల వెంకట అప్పలనాయుడు (గోవింద్) స్పష్టం చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, సీహెచ్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఎనిమిది బాధిత గ్రామాల ప్రజలతో ఆందోళన చేపట్టారు. నేవల్ ఆర్మ్డ్ డిపో ఏర్పాటు చేయవద్దని కోరుతూ తహశీల్దార్ పేడాడ జనార్దనరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో గోవింద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ భూములుండగా, దత్తిరాజేరులో ఎందుకు ఎన్ఏడీ ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
మండలంలో ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, అటువంటి వారి కడుపు కొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీపీఎం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, పచ్చటి పొలాల్లో ఎన్ఏడీ ఏర్పాటు చస్తే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఇటువంటి ప్రమాదకరమైన నిర్మాణాలను వెంటనే ఆపకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ కామేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్ఏడీ వల్ల మండలానికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కడుబండి రమేష్‌నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మంత్రి అప్పలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ రౌతు జయప్రసాద్నాయుడు మాట్లాడుతూ, ఎన్ఏడీ వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వి. కృష్ణాపురం, వింద్యవాసి సర్పంచ్‌లు మర్పిన తిరుపతి, కోలా సత్తిబాబు, గుషిడి జగన్నాథం, మార్పిన సత్యనారాయణ, రొంగలి వెంకన్న, ఆదినారాయణ, కర్రి అప్పలనాయుడు, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.