కడతేరిన కుటుంబం
అగ్రరాజ్యంలో ఓ ప్రవాస భారతీయ జంట అనుమానాస్పద పరిస్థితుల్లో కడతేరిపోయింది. కొడుకు పోయిన విషాదం నుంచి తేరుకోకముందే భార్యాభర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి మరణానికి గల కారణాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటన టెక్సాస్ లోని ఫ్రిస్కోలో చోటుచేసుకుంది.
సుమీత్ ధావన్(43), పల్లవి(39) భార్యాభర్తలు. వీరికి అర్నవ్ అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే అర్నవ్ ను ఎప్పుడు ఒక మనిషి కనిపెట్టుకుని చూడాల్సివచ్చేది. ఈ ఏడాది జనవరిలో ఆర్నావ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నానాల గదిలో బాత్ టబ్‌లో ఐస్ గడ్డలతో కప్పబడిన అతడి మృతదేహం వెలుగుచూసింది.
అర్నవ్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడని, విదేశాలకు వెళ్లిన సుమీత్ తిరిగివచ్చే వరకు ఉంచాలన్న ఉద్దేశంతో అర్నవ్ మృతదేహాన్ని ఐస్ లో పెట్టానని పల్లవి పేర్కొంది. హిందూ ధర్మం ప్రకారం అతడి కర్మకాండలు జరిపించాలన్న ఉద్దేశంతో తానీ పనిచేసినట్టు పేర్కొంది. అయితే టెక్సాస్ లో ఉంటున్న సుమీత్ తోబుట్టువులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నకు పల్లవి వద్ద సమాధానం లేదు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి ప్రశ్నించారు. అర్నవ్ హత్య చేశారా అన్న ప్రశ్నకు పల్లవి అవును అన్నట్టుగా తలవూపిందని పోలీసులు పేర్కొన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకుని ఎప్పుడు చిన్నదెబ్బ కూడా వేయని పల్లవి హత్య చేసిందంటే తనకు నమ్మశక్యంగా లేదని సుమీత్ వాపోయాడు.
ఈ కేసు విచారణ నడుస్తుండగానే సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్విమ్మింగ్ పూల్ లో పల్లవి శవమై తేలగా, సుమీత్ తలపై గాయంతో తన గదిలో నిర్జీవ స్థితిలో కనిపించాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైన కారణం ఉందా అనేది ఇంకా తేలలేదు. వీరి ఇంట్లో దొరికిన నోట్ లో ఏముందో వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఏదేమైనా ఓ విషాదం ప్రవాస కుటుంబాన్ని కడతేర్చింది.