3-5 ఏళ్లలో కామన్ ఫ్లోర్ ఐపీఓ
ముంబై : బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రోపర్టీ పోర్టల్ కామన్ఫ్లోర్డాట్కామ్ 3-5 ఏళ్లలో ఐపీఓకు రానుంది. రెండేళ్లలో లాభాల బాట పడతామని కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన సుమిత్ జైన్ చెప్పారు. వ్యాపార విస్తరణ నిమిత్తం 3-5 ఏళ్లలో ఐపీఓకు వస్తామన్నారు. అయితే ఎంత మొత్తంలో నిధులు సమీకరించేదీ ఆయన వెల్లడించలేదు. ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోందని, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోందని, దీంతో ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ జోరుగా వృద్ధి సాగిస్తోందని జైన్ వివరించారు.
కొత్త ఉత్పత్తులందించడం, టెక్నాలజీ, సమాచార సేకరణ... ఈ మూడు అంశాలపై భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపారు. ఇటీవలనే సీఎఫ్ రెటినా (ప్రోపర్టీని వర్చువల్గా అనుభూతినిచ్చే), లివ్-ఇన్ టూర్స్(ప్రోపర్టీని పూర్తిగా వర్చువల్గా వీక్షించడం) సర్వీసులను ప్రారంభించామని తెలియజేశారు. లివ్-ఇన్ టూర్స్ ఫీచర్ కింద ప్రస్తుతం 15,000 ప్రోపర్టీలు ఉన్నాయని, ఆర్నెళ్లలో దీనిని ఐదు లక్షలకు పెంచనున్నామని పేర్కొన్నారు. తమ పోర్టల్లో 200 నగరాల్లోని కోటికి పైగా ప్రోపర్టీలు లిస్ట్ అయి ఉన్నాయని చెప్పారు.