కొవ్వుతో అందమైన శరీర భాగాల రూపకల్పన
- చర్మవ్యాధుల వైద్యుల సదస్సులో డాక్టర్ సుమిత శంకర్
అరండల్‌పేట(గుంటూరు) : కొవ్వు అనగానే వామ్మో... కొవ్వు వెంటనే తగ్గించుకోవాలి, లేకపోతే ప్రమాదం అన్న మాటలు తరుచూ వింటుంటామని, అది నిజమే అయినప్పటికీ అదే కొవ్వుతో మన శరీర భాగాలను అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చని ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ సుమితశంకర్ తెలిపారు. మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్లో శనివారం నాలుగు రాష్ట్రాల చర్మవ్యాధుల వైద్య నిపుణుల సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సుమిత శంకర్ మాట్లాడుతూ పలు కారణాల వల్ల వివిధ శరీర భాగాలు కుచించుకొని, పాడైపోయే ప్రమాదం ఉందని, దాన్ని తిరిగి ఉత్తేజపరచడానికి, యథాస్థితికి రావడానికి ఈ కొవ్వు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. పలు శరీర భాగాల పెరుగుదల, పునరుత్పత్తిలో స్టెమ్ సెల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అటువంటి స్టెమ్‌సెల్స్ తయారు కావడంలో కొవ్వు పదార్ధం కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
దాదాపు 3 దశాబ్దాల నుంచి శరీరం నుంచి కొవ్వును తొలగించే ప్రక్రియ జరుగుతూ వస్తుందని చెప్పారు. తొలగించిన కొవ్వును బ్రెస్ట్ పెరుగుదలకు, బుగ్గలు నునుపు తేలేందుకు, బటక్స్‌ను అందంగా మార్చేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. పరిశోధనల క్రమంలో కొవ్వును తాజాగా చర్మం ముడతలు పడకుండా, ముక్కు అందంగా తీర్చిదిద్దేందుకు వాడుతూ వచ్చారని చెప్పారు. ప్రస్తుతం రేడియేషన్ ద్వారా కుచించుకుపోయిన చర్మాన్ని పునరుత్తేజపరచడం, కాలిపోయిన చర్మాన్ని యథాస్థితికి తీసుకురావడం వంటి వాటికి ఈ కొవ్వును వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొవ్వు ద్వారా తయారయ్యే స్టెమ్‌సెల్స్‌ను ఉపయోగించి జుట్టుపెరుగుదల, కొత్తగా వెంట్రుకలను మొలిపించడంతో పాటు పళ్లు గట్టితనానికి, మెరవడానికి దీనిని వినియోగించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఆమె వివరించారు.