పర్యాటకులను ఆకట్టుకుంటున్న నీటిపక్షులు
మహబూబ్‌నగర్ (దేవరకద్ర) : భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కోయిల్‌సాగర్‌లో నీటి పక్షులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో ప్రాజెక్టులోని నీరు తగ్గుముఖం పడుతుండడంతో నీటిలోని చేపలు, వివిధ రకాల పురుగులను తినడానికి పలురకాల పక్షులు ప్రాజెక్టు వద్దకు వేలసంఖ్యలో తరలివస్తాయి. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వివిధ రకాల పక్షులు ప్రాజెక్టు నీటి వద్దకు వచ్చి సందడి చేస్తున్నాయి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రంవేళల్లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో పక్షులు చేసే సందడి అంతా ఇంతా కాదు. తెల్లమచ్చకోడి, వివిధ రంగుల కొంగలు, ఆరె పిట్టలు, నీటి బాతులు తదితర నీటి పక్షులు చేసే సందడితో కోయిల్‌సాగర్ ప్రాంతం కొల్లేరును తలపిస్తుంది. ప్రాజెక్టు నీటిలో శనివారం సందడి చేసిన పక్షులను 'సాక్షి' తన కెమెరాలో బంధించింది.