ఎండకాలం పండ్లోయ్!
వేసవి అనగానే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు. పండ్లలో రారాజుగా ప్రసిద్ధి పొందిన మామిడి మన జాతీయ ఫలం. అంతమాత్రాన వేసవిలో కేవలం మామిడి పండ్లు మాత్రమే తింటారనేం కాదు.వేసవిలో మామిడితో పాటు రకరకాల ఇతర ఫలాలూ విరివిగా దొరుకుతాయి. మామిడి పండ్లు అమిత జనాదరణ పొందినప్పటికీ, వేసవిలో విరివిగా దొరికే మిగిలిన ఫలాలను కూడా జనాలు బాగా ఆస్వాదిస్తారు. వేసవి సందర్భంగా మామిడి గురించి, మరిన్ని వేసవి ఫలాల గురించి మీ కోసం...
మామిడి
మామిడి పండ్లను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. మామిడి ఉత్పాదనలో మాత్రం మన భారతదేశానిదే అగ్రస్థానం. మామిడిలో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. మామిడికి దాదాపు నాలుగువేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పోర్చుగీసుల ద్వారా మామిడి భారత్‌లోకి అడుగుపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, మామిడి చెట్లు దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల ఏళ్ల కిందటే ఉనికిలో ఉండేవని శిలాజాల ఆధారాల వల్ల తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక ప్రాంతాల్లో పురాతన కాలం నుంచే మామిడి చెట్లు ఉండేవని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. వేదాలలో, పురణాలలో మామిడి ప్రస్తావన కనిపిస్తుంది. పూజలు, ఇతర శుభకార్యాలు జరిపేటప్పుడు ఇళ్ల ముంగిళ్లకు, దేవాలయాల ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టడం సనాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.
మామిడి కాయలతో ఆవకాయ, మాగాయ వంటి నిలవ పచ్చళ్లు తయారు చేసుకుని, ఏడాది పొడవునా ఉపయోగించడం శతాబ్దాలుగా భారతీయులకు అలవాటే. ఆయుర్వేద వైద్యంలోనూ మామిడికి చాలా ప్రాధాన్యం ఉంది. మామిడి కాయలు, పండ్లతో పాటు ఆకులను, బెరడును, టెంకలోని జీడిని కూడా ఆయుర్వేద చికిత్సల్లో వినియోగిస్తారు.
పచ్చి మామిడిని వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో పుల్లని పచ్చిమామిడి ముక్కలను బాగా ఎండబెట్టి, పొడిగా తయారు చేసి, ఈ పొడిని (ఆమ్చూర్) వంటకాల్లో ఉపయోగిస్తారు. తూర్పు భారత ప్రాంతంలో పచ్చి మామిడి ముక్కలను ఎండబెట్టి, ఒరుగులుగా తయారు చేసి, ఏడాది పొడవునా వంటకాల్లో ఉపయోగిస్తారు. వేసవిలో మామిడి పండ్లను తినడానికి పిల్లలూ పెద్దలూ అందరూ అమితంగా ఇష్టపడతారు. భారత్ సహా ఉష్ణమండల దేశాల్లో విరివిగా పండే మామిడి ఇతర శీతల దేశాలకూ విరివిగా ఎగుమతి అవుతోంది. మామిడిలో బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, ఆల్ఫోన్సా, గోవా, కీసర, లంగ్డా, సఫేదా, మల్గోబా వంటి రకాలు బాగా ప్రసిద్ధి పొందాయి. మామిడి పండ్ల గుజ్జుతో తాండ్ర తయారు చేస్తారు. ఏడాది పొడవునా మామిడి రుచిని ఆస్వాదించాలనుకునే వారికి తాండ్ర ఒక చక్కని ప్రత్యామ్నాయం. మామిడి పండ్ల రసాన్ని, జామ్‌ను నిల్వ ఉంచేలా సీసాల్లో నింపి విక్రయించడం కూడా గత కొన్ని దశాబ్దాలుగా బాగా వాడుకలోకి వచ్చింది. నిల్వ ఉంచే పద్ధతుల ఫలితంగా మామిడి రుచులు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటూనే ఉన్నాయి. అయినా, వేసవిలో తాజా మామిడి పండ్లను తినడంలో ఉన్న మజానే వేరు. అందుకే మామిడి రుచుల కోసం అందరూ వేసవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మామిడిలో పోషకాలు
మామిడిలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు నామమాత్రంగా ఉంటాయి. మామిడి పండ్లలో విటమిన్–ఏ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
ఈత పండ్లు
ఈత చెట్లు భారత ఉపఖండంతో పాటు మారిషస్, ప్యూయెర్టో రికో, కరీబియన్ తీరంలోని లీవార్డ్ దీవుల్లోను విరివిగా కనిపిస్తాయి. రుచిలో దాదాపు ఖర్జూరాన్ని తలపించే ఈత పండ్లు వేసవిలో విరివిగా పండుతాయి. ఖర్జూరాలలో గింజ చిన్నగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటే, ఈత పండ్లలో గింజ పెద్దదిగా ఉండి, గుజ్జు కాస్త తక్కువగా ఉంటుంది. రుచిలో ఖర్జూరాన్ని తలపిస్తాయి కనుకనే వీటిని ‘ఇండియన్ వైల్డ్ డేట్స్’ అని అంటారు. వేసవిలో ఈతపండ్లను కాలక్షేపంగా తినడానికి పిల్లలూ పెద్దలూ ఇష్టపడతారు. ఈత పండ్ల గుజ్జుతో జెల్లీ తయారు చేసి, ఏడాది పొడవునా నిల్వ ఉంచుతారు. అలాగే, ఈతపండ్ల గుజ్జుతో వైన్ కూడా తయారు చేస్తారు. ఈత చెట్టు కాండానికి పైభాగంలో గాటు పెట్టి, దాని నుంచి కారే ద్రవాన్ని పులియబెట్టి కల్లుగా తయారు చేసి తాగుతారు. ఈ ద్రవాన్ని పులియబెట్టకుండా నేరుగా మరిగించి, దానితో ఈతబెల్లం తయారు చేస్తారు. చెరకు బెల్లం కంటే ఈత బెల్లంలో చక్కెర స్థాయి కాస్త తక్కువగా ఉంటుంది. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లలో ఈతబెల్లం వాడుక ఎక్కువ. ఈత చెట్లకు పుట్టినిల్లు మన భారతదేశమేనని పరిశోధకులు చెబుతున్నారు. పోషకాల కోసం ఖర్జూరంపై ఆధారపడలేని వాళ్లకు ఈతపండ్లు చౌకైన ప్రత్యామ్నాయం.
ఈతపండ్లలో పోషకాలు
ఈత పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈతపండ్లలో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
తాటి ముంజెలు
వేసవిలో మామిడిపండ్ల తర్వాత గుర్తొచ్చేవి తాటి ముంజెలు. ఏపుగా దాదాపు ముప్పయి మీటర్ల పొడవున పెరిగే తాటి చెట్లు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా కనిపిస్తాయి. ఏటా వేసవిలో తాటికాయలు విరివిగా కాస్తాయి. దృఢమైన తాటికాయలలోని ముంజెలు మాత్రం చాలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనానికి పిల్లలూ పెద్దలూ తాటి ముంజెలను తినడానికి ఇష్టపడతారు. తాటి ముంజెలు తక్షణ శక్తినిస్తాయి. డీహైడ్రేషన్ నుంచి రక్షణనిస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువును అదుపులో ఉంచుతాయి. తాటిచెట్టు కాండానికి పైభాగంలో గాటు పెట్టి, దానిని వచ్చే రసాన్ని సేకరిస్తారు. దీనిని పులియబెట్టి కల్లు తయారు చేస్తారు. పులియబెట్టకుండా, దీనిని నేరుగా మరిగించి, తాటిబెల్లాన్ని తయారు చేస్తారు. చక్కెరశాతం తక్కువగా ఉండే తాటిబెల్లం మధుమేహ రోగులకు మంచిదని చెబుతారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో తాటిబెల్లాన్ని మిఠాయిల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇండోనేసియాలో తాటి చక్కెరను కూడా తయారు చేస్తారు.
తాటిముంజెల్లో పోషకాలు
తాటి ముంజెల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చక్కెరలు, కొవ్వులు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్– బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
పనసపండ్లు
పనసపండ్లు పరిమాణానికి భారీగా ఉంటాయి. పైకి గరుకుగా కనిపించే పనసపండ్లు చూడటానికి అంత ఆకర్షణీయంగా కనిపించవు. వీటిని కోసి చూస్తే మాత్రం, వీటిలోని తొనల పరిమళం గుప్పున వ్యాపించి, నోరూరిస్తుంది. పనస పండ్ల దిగుబడి సాధారణంగా వేసవి ప్రారంభం నుంచే మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవి వేసవి మొదలుకొని వర్షాకాలం వరకు దొరుకుతాయి. రుచికి బాగా తీపిగా ఉండే పనస తొనలను తినడానికి అందరూ ఇష్టపడతారు. పనస చెట్లు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. పనసను తొలుత మలేసియా, జావా, బాలి ప్రాంతాలకు చెందిన వారు పెంచి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. ఇది పోర్చుగీసుల ద్వారా భారత్‌కు చేరుకుందని కూడా చెబుతారు. భారతీయులు ఎక్కువగా పనస తొనలను నేరుగా తింటారు. కొన్ని దేశాల్లో పనస తొనలతో మిఠాయిలు, జ్యూస్, కేకులు, ఐస్‌క్రీమ్ వంటివి కూడా తయారు చేస్తారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పనస తొనలను ముక్కలుగా తరిగి, తురిమిన మంచుతో కలిపి తింటారు. దక్షిణ భారతదేశంలో పనసపొట్టు కూర చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పనస గింజలను కూడా వంటకాల్లో వాడతారు. కేరళలో పనసతొనల తురుమును నేతిలో వేయించి, బెల్లంతో కలిపి ‘చక్కవరట్టి’ అనే జామ్‌లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. దాదాపు ఆరు నుంచి పది నెలలు నిల్వ ఉండే ఈ పదార్థంతో ‘అడ’ అనే పిండివంటకాన్ని తయారు చేస్తారు.
పనసపండ్లలో పోషకాలు
పనసపండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొద్ది పరిమాణంలోని కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి, విటమిన్–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
కర్బుజాపండ్లు
వేసవి తాపం నుంచి ఉపశమనానికి పుచ్చకాయల తర్వాత కర్బూజా పండ్లనే విరివిగా ఉపయోగిస్తారు. వీటి పైతోలు కొంచెం గరుకుగా, మందంగా ఉన్నా, లోపలి గుజ్జు మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. కర్బూజాలోని కొన్ని రకాల్లో పైతోలు పలుచగా ఉంటుంది. కర్బూజా పండ్లు పక్వానికి వచ్చేటప్పుడు ఒకరకమైన వాసన వెదజల్లుతాయి. ఈ వాసన కస్తూరి జింక (మస్క్ డీర్) నుంచి వచ్చే వాసనను పోలి ఉండటంతో కర్బూజాకు ఇంగ్లిష్‌లో ‘మస్క్ మెలన్’ అనే పేరు వచ్చింది. దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే ఆఫ్రికాలో కర్బూజాను సాగు చేసేవారు. ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల్లోనూ కర్బూజాను పండించేవారు. ఇరాన్, ఆర్మీనియా, అఫ్ఘానిస్తాన్, తుర్కుమెనిస్తాన్, వాయవ్య భారత ప్రాంతంలో కర్బూజాను విరివిగా పండిస్తారు. భారత ఉపఖండ ప్రాంతం నుంచి కర్బూజా చైనా, పర్షియా తదితర ప్రాంతాలకు విస్తరించింది. కర్బూజా ముక్కలను నేరుగా తినడంతో పాటు, కర్బూజా రసాన్ని, ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీమ్స్ వంటి వాటిని తీసుకుంటారు.
కర్బూజా పండ్లలో పోషకాలు
కర్బూజా పండ్లలో ఎక్కువగా నీరు, స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెరలు ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు నామమాత్రంగా ఉంటాయి. కర్బూజా పండ్లలో విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–సి పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
నేరేడు పండ్లు
ముదురు ఊదా రంగులో నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు. కొంత తీపి, పులుపు, కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లను మధుమేహ చికిత్సలో విరివిగా వాడతారు. ఆయుర్వేద, యునానీ, చైనీస్ సంప్రదాయ వైద్య విధానాల్లో నేరేడు గింజలతోను, నేరేడు చెట్ల బెరడుతోను తయారు చేసిన ఔషధాలను ఉపయోగిస్తారు. నేరేడు భారత ఉపఖండ ప్రాంతంలో విరివిగా కనిపిస్తుంది. నేరేడు పండ్లను సాధారణంగా నేరుగానే తింటారు. కొన్ని ప్రాంతాల్లో నేరేడు గుజ్జుతో జామ్, జెల్లీ, జ్యూస్ వంటివి కూడా తయారు చేస్తారు. పోర్చుగీసు వర్తకుల ద్వారా నేరేడు విత్తనాలు దక్షిణ అమెరికాకు చేరుకున్నాయి.
నేరేడు పండ్లలో పోషకాలు
నేరేడు పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. నామమాత్రంగా కొవ్వులు ఉంటాయి. విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
పుచ్చకాయలు
పుచ్చకాయలు నిజానికి ఏడాది పొడవునా దొరికినా, వేసవిలో మాత్రం వీటి వినియోగం అధికం. ఎక్కువ నీటితో ఉండే పుచ్చకాయలు తక్షణమే శక్తినిచ్చి, వేసవి తాపాన్ని తట్టుకునేలా చేస్తాయి. పరిమాణానికి ఇవి భారీగా కనిపించినా, వీటిని కోయడం చాలా తేలిక. కొయ్యగానే ఎర్రగా కనువిందు చేస్తూ, నోరూరించే పుచ్చకాయలను పిల్లలూ, పెద్దలూ అందరూ బాగా ఇష్టపడతారు. క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల కిందట ఆఫ్రికాలో నైలునదీ తీరంలో విరివిగా పెరిగే పుచ్చకాయల మొక్కలు కాలక్రమంలో దేశదేశాలకు విస్తరించాయి. ఇవి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో భారత్‌కు, ఇక్కడి నుంచి పదో శతాబ్ది నాటికి చైనాకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ పుచ్చకాయల సాగు విరివిగా సాగుతోంది. పుచ్చకాయల్లో దాదాపు 1200 రకాలు ఉన్నాయి. భారీగా కనిపించే పుచ్చకాయలు ఒక్కొక్కటి కనీసం కిలో నుంచి 90 కిలోల వరకు బరువు తూగుతాయి. పుచ్చకాయలను ఎక్కువగా నేరుగానే తింటారు. వీటి తాజా రసాన్ని, వీటితో తయారు చేసే శీతల పానీయాలను కూడా విరివిగా వినియోగిస్తారు. చైనాలో పుచ్చకాయల గుజ్జును ఎండబెట్టి, పిండిగా తయారు చేసి, దానిని వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో పుచ్చకాయ ముక్కలతో ఊరగాయలు, కూరలు కూడా చేసుకుంటారు. దక్షిణ రష్యాలో పుచ్చకాయ గుజ్జు, క్యాబేజీ తురుము కలిపి పులియబెట్టి తింటారు.
పుచ్చకాయల్లో పోషకాలు
పుచ్చకాయల్లో ఎక్కువగా నీరు స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లు, కొవ్వులు చాలా స్వల్పంగా ఉంటాయి. పుచ్చకాయల్లో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
సీమ చింతకాయలు
సీమచింతలు వేసవి ప్రారంభంలోనే అందుబాటులోకి వస్తాయి. పిల్లలు ఎక్కువగా వీటిని కాలక్షేపం చిరుతిండిలా తినడానికి ఇష్టపడతారు. సీమచింతను ఎవరూ ప్రత్యేకంగా సాగు చేయరు. ఉష్ణమండల దేశాల్లోని అడవుల్లో, బంజరు నేలల్లో సీమచింత చెట్లు కనిపిస్తాయి. వీటి గుజ్జు సాధారణంగా తెల్లగా, అప్పుడప్పుడు గులాబిగా ఉంటుంది. చిరుతీపిగా ఉండే గుజ్జు రుచిగా ఉంటుంది. సీమచింతకాయలు చూడటానికి జిలేబీల్లా చుట్టలు చుట్టల్లా ఉంటాయి. అందుకే కాబోలు, ఉత్తరాదిలో వీటిని ‘జంగ్లీ జిలేబీ’ అంటారు. సీమచింత ఆకులను, చెట్టు బెరడును సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగిస్తారు.
సీమచింతకాయల్లో పోషకాలు
సీమచింతకాయల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, చక్కెరలు, పీచు పదార్థాలు ఉంటాయి. వీటిలో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.
లిచీ పండ్లు
లిచీ పండ్లు చూడటానికి స్ట్రాబెర్రీ పండ్ల మాదిరిగా పైకి ఎర్రగా కనిపించినా, వీటి లోపలి గుజ్జు మాత్రం తాటి ముంజెల గుజ్జు మాదిరిగా మెత్తగా, తియ్యగా ఉంటుంది. వేసవిలో విరివిగా దొరికే లిచీ పండ్లు భారత ఉపఖండ ప్రాంతంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దక్షిణప్రాంత దేశాల్లో పండుతాయి. లిచీ పండ్ల గుజ్జును సాధారణంగా నేరుగానే తింటారు. ఈ గుజ్జును శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, మిఠాయిల తయారీలో కూడా వాడతారు.
లిచీ పండ్లలో పోషకాలు
లిచీ పండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
జీడిమామిడి
మిగిలిన పండ్లన్నిటికీ గింజలు లోపల ఉంటే, దీనికి మాత్రం గింజ పండుకు బయట ఉంటుంది. ఆ గింజల నుంచే జీడిపప్పును సేకరిస్తారు. జీడిమామిడి గుజ్జు కొంత తియ్యగా, కొంత వగరుగా ఉంటుంది. ఏటా వేసవిలో ఉష్ణమండల తీర ప్రాంతాల్లో జీడిమామిడి విరివిగా పండుతుంది. ఇవి విరివిగా దొరికే ప్రాంతాల్లోని జనాలు ఈ పండ్లను నేరుగా తింటారు.
జీడిమామిడి పండ్లలోని పోషకాలు
జీడిమామిడి పండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆల్ బుకారా పండ్లు
గంగ రేగు పండ్ల కంటే కాస్త పెద్దగా, యాపిల్ కంటే కొంత చిన్నగా ఎరుపు, లేత నేరేడు రంగుల్లో నిగనిగలాడుతూ కనిపించే అల్ బుకారా పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతాయి. అల్ బుకారా పండ్ల గుజ్జు తియ్యగా, చిరుపులుపుతో రుచిగా ఉంటుంది. సాధారణంగా వీటి గుజ్జును నేరుగా తింటారు. వీటిని ఎండబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మిఠాయిల తయారీలో ఉపయోగిస్తారు.
అల్ బుకారా పండ్లలో పోషకాలు
అల్ బుకారా పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, బి–2, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.