ఎండాకాలం... మసాజ్ తప్పనిసరి
బ్యూటిప్స్
వేసవి కాలం ఎండ, దుమ్ము వల్ల శిరోజాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాపాడుకోవాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాడుకు రక్తప్రసరణ సక్రమంగా అందాలి. ఇందుకు తలకు పట్టించే నూనెలను వేడి చేసి, వెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించి, మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం రసాయన గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది.
జుట్టురాలడం తగ్గాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఉత్పత్తులను వాడాలి. కొబ్బరిపాలు జుట్టుకు తగినంత మృదుత్వాన్ని ఇస్తాయి. ఉసిరి చుండ్రును నివారిస్తుంది.ఈ కాలం మాడు పొడిబారడం సహజం. ఇలాంటప్పుడు కలబంద రసం మాడుకు పట్టించి, శుభ్రపరచాలి. దీని వల్ల చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు కప్పుల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలు మృదువుగా అవుతాయి. ‘ఇ’ విటమిన్ సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్స్, పాలు, గుడ్లు, ఆకుకూరల రోజూ తీసుకునే ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారం జుట్టు కుదుళ్లకు ఆరోగ్యాన్నిస్తుంది.