జోరుగా సాగుతున్న జీహెచ్ఎంసీ శిబిరాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో జీహెచ్ఎంసీ క్రీడాధికారులు, కోచ్‌లు, సిబ్బంది బిజీగా ఉండడంతో శిబిరాలు కాస్త ఆలస్యంగా ఆరంభమయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో శిబిరాలవైపు అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఈ సారి ఎన్నికల కోడ్ కారణంగా శిబిరాల ప్రారంభ వేడుకల్ని నిర్వహించలేదని క్రీడాధికారులు తెలిపారు. జంటనగరాల్లో ఐదు సర్కిల్స్‌లో దాదాపు 1200పైగా క్రీడా మైదానాల్లో 54 క్రీడాంశాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి.
ఇక్కడికి వచ్చే బాలబాలికల సంఖ్య కూడా గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరిగిందని పలువురు కోచ్‌లు తెలిపారు. ఇదిలా ఉండగా అంబర్‌పేట్‌లోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో మలక్‌పేట్ నియోజక వర్గం ఈవీఎంలను భ ద్రపరచడంతో పాటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ఆ మైదానంలోకి క్రీడాకారులను అనుమతించడంలేదు. అలాగే ఎల్బీ స్టేడియం, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరచడంతో శిబిరాలు జరగడంలేదు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఆధ్వర్యంలో ఆధికారికంగా ఈనెల 1 నుంచి వేసవి క్రీడా శిబిరాలు జరుగుతున్నాయి.