ఏపీ బ్రాండ్ నేమ్ ‘సన్ రైజ్ కంట్రీ’
సీఎం చంద్రబాబు వెల్లడి
త్వరలో పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం
విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం
పరిశ్రమలు, మౌలిక వసతులపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఒక బ్రాండ్ నేమ్‌ను తీసుకురావలసిన అవసరముందని, ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు సన్ రైజ్ కంట్రీగా బ్రాండ్ నేమ్‌ను ఎంపిక చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇదే పేరుతో ఇక ముందు రాష్ట్రాన్ని ప్రపంచదేశాల ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఈ పేరు ఎంపికపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు అనుకూలమైన వ్యవస్థను, వాతావరణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. త్వరలో రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిధి గృహంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి రంగాలపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తాం. జౌళి, ఫుడ్‌ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, పర్యాటకం తదితర 11 రంగాలకు కూడా ప్రత్యేక విధానాలు రూపొందించనున్నాం.
త్వరలో 11 రంగాలపై విధాన పత్రాలను విడుదల చేస్తాం. ఓడరేవులను అభివృద్ధి చేస్తాం. మచిలీపట్నంలో ఒక ఓడరేవు రాబోతోంది. రాష్ట్రాభివృద్ధికి ఎనిమిది నుంచి తొమ్మిది ప్రగతి వాహకాల (గ్రోత్ ఇంజన్లు)ను ఏర్పాటు చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 500 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్, రాజమండ్రిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లాలో మెరైన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. విశాఖపట్నాన్ని ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. గుంటూరులో టెక్స్టైల్ కారిడార్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో హార్టికల్చర్ కారిడార్, విశాఖపట్నంలో ఫార్మా కారిడార్ ఏర్పాటు చేస్తాం. అన్నిరకాల మాఫియాలను నియంత్రిస్తాం. త్వరలో ఇసుక విధానాన్ని ప్రకటిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సహా పలు సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారుు...’ అని సీఎం చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో కుదేలు: తాము అధికారంలో ఉన్న 1995 నుంచి 2005 వరకూ పారిశ్రామిక రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది లక్షలాది మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు చెప్పా రు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని నామరూపాలు లేకుండా చేసిందని అన్నారు. భూములు, గనుల కేటాయిం పుల్లో అవినీతికి పాల్పడ్డారని, కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టే పేరుతో గనులను లీజుకు తీసుకుని విదేశాలకు ఎగుమతి చేసుకున్నార న్నారు. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ, ఓబులాపురం గనులు ఇందుకు నిదర్శనమని చెప్పారు. రూ.12 వేల కోట్లు రుణాలుగా తీసుకుని పరిశ్రమలు పెట్టిన వారు ఇప్పుడు నష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని బాబు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు భూములు తీసుకున్న కొందరు వాటిని బ్యాంకుల్లో తాక ట్టు పెట్టారని, అలాంటి వాటిని వెనక్కు తీసుకుంటామని చెప్పారు.