రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం.
అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది.
ఢిల్లీ కృత్రిమత్వం నుంచి
‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం.
దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్.
కష్టనష్టాలకు ఓర్చి
‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి.
మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్.