ఆ లోగో వాడకండి!
కేజ్రీవాల్‌కు ఆప్ లోగో రూపకర్త సునీల్‌లాల్ డిమాండ్
పార్టీపై భ్రమలన్నీ తొలగిపోయాయంటూ లేఖ
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)లో గందరగోళ పరిస్థితిపై అసంతృప్తి చెందిన ఆ పార్టీ లోగో రూపకర్త, ఆప్ వలంటీర్ సునీల్‌లాల్... తన డిజైన్‌ను వినియోగించడం ఆపేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేజ్రీవాల్‌కు ఒక లేఖ రాశారు. ‘స్వరాజ్’ భావనను కేజ్రీవాల్ వక్రీకరిస్తున్నారని అందులో ఆరోపించారు. ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్, ఆనంద్‌కుమార్ తదితరులపై తీసుకున్న చర్యలను కూడా సునీల్ తప్పుబట్టారు. ‘‘నేను 2013 నుంచి ఆప్ కార్యకర్తగా ఉన్నాను. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీపై నా భ్రమలన్నీ తొలగిపోయాయి. ముందు ముందు ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు. ఇలాంటి చర్యలతో మహాత్మాగాంధీ నినదించిన స్వరాజ్‌ను తీసుకురాలేరు. ప్రజాస్వామిక సూత్రాలను తొక్కేసి.. స్వరాజ్‌ను సాధిస్తామంటే ఎలా?’’ అని కేజ్రీవాల్‌ను సునీల్ ప్రశ్నించారు. తాను రూపొందించిన లోగోను వినియోగించడాన్ని ఆప్ ఆపేయాలని.. ఆ డిజైన్ హక్కులను తాను పార్టీకి అప్పగించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రచిహ్నం దుర్వినియోగంపై ఆమ్ఆద్మీకి హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రాష్ట్ర చిహ్నాన్ని దుర్వినియోగపరచిన అంశంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పందించింది. ఈ మేరకు ఆమ్ఆద్మీ పార్టీతో పాటు, రాష్ట్ర చిహ్నాన్ని దుర్వినియోగపరుస్తూ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రితురాజ్గోవిందుక నోటీసులు పంపింది.