హేమాహేమీలంతా ఒక్కటైన వేళ!
ఉపఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: సాధారణ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పుణ్యమా అని ఒక్కతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పాలనను ఎండగట్టడంతోపాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కరపత్రాలనూ ఇంటింటికీ పంచుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, కేంద్ర మాజీమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు డీకే అరుణ, జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్సహా తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులంతా వారంరోజులుగా ఎన్నికల ప్రచారంలో ఇంటిం టికీ తిరుగుతూ చెమటోడుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్‌అలీ ప్రత్యేకంగా సమావేశమై ప్రచార సరళి, పార్టీ పరిస్థితిపై పోలింగ్‌బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించడంతోపాటు పార్టీ బలహీనంగా ఉన్న బూత్‌లను గుర్తించి వాటిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్నటివరకు ఆర్థికవనరుల్లేక ప్రచారంలో వెనుకబడినప్పటికీ ప్రచార ఖర్చు భరించేందుకు కొందరు ముఖ్యనేతలు తాజాగా ముందుకు రావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
సవాల్‌గా తీసుకున్న హైకమాండ్: ఉపఎన్నికలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన దూతలుగా ఏఐసీసీ కార్యదర్శులు రామచంద్ర కుంతియా, బి.కృష్ణమూర్తిలను నియమించింది. తెలంగాణలో మకాం వేసిన ఆయా నేతలు ఎప్పటికప్పుడు ఉప ఎన్నికల పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేయడంతోపాటు రాష్ట్ర నేతలకు తగిన సూచనలిస్తున్నారు. అంతేకాక వారిద్దరూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోందని మాజీమంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.