భయం భయంగా అమెరికా వచ్చాను!
లండన్: సూపర్ మోడల్ గా తనకంటూ పేరు సంపాదించుకుంది నినా అగ్డాల్. ప్రస్తుతం తాను లగ్జరీ జీవితాన్ని లీడ్ చేస్తున్నానని, గతంలో అలాంటి పరిస్థితులు లేవని కొన్ని వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తన సొంతదేశం డెన్మార్క్ నుంచి అమెరికాకు పొట్టచేత పట్టుకుని తక్కువ డబ్బుతో.. ఎక్కువ భయంతో వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో ఆమె చేతిలో కేవలం 40 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నాయట. దాంతోపాటు మరెన్నో భయాలు తనను వెంటాడాయని చెబుతోంది. నటిగానూ అడుగులు వేస్తోంది నినా.
ప్రస్తుతం తన వయసు 24 ఏళ్లు.. కాగా ఆరేళ్ల కిందట తన పరిస్థితి వేరని చెప్పుకొచ్చింది మోడల్ నినా అగ్డాల్. 18 ఏళ్లున్నప్పుడు డెన్మార్క్ లోని హిల్లేరోడ్ నుంచి మయామి, ఫ్లోరిడాలకు వచ్చినప్పుడు ఎంతో భయం భయంగా ఉండేదట. అసలు ఇంగ్లీష్ అంటే తనకెంతో భయమని, స్కూల్లోనూ తనకు నచ్చని సబ్జెక్ట్ అదేనని నినా అంటోంది. అంచెలంచెలుగా ఎదిగిన నినా మోడల్ గా తనకంటూ పేరు, డబ్బు, హోదాను సంపాదించుకుంది. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోతో డేటింగ్ చేస్తూ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ. రోజుకు మూడుసార్లు కచ్చితంగా వర్కవుట్స్ చేస్తానని, లేకపోతే ఆరోగ్యంతో పాటు శరీరాకృతి దెబ్బతింటుందని ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలాంటివి తప్పవంటోంది.