supervisers
-
‘అంగన్వాడీ’ల్లో పౌష్టికాహారం పక్కదారి
ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పేదలు ఉపయోగించే ఈ ఆహారం పక్కదారి పట్టించడంలో ఆ శాఖ సిబ్బంది, అధికారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. కార్యకర్తల నుంచి కొంతమంది సూపర్వైజర్లు అందినకాడికి దండుకుని నల్లబజారుకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మామూళ్లు, సరుకులు ఇవ్వని కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు. దీనికితోడు అంగన్వాడీ కేంద్రం అద్దె, కట్టెల, అమృతహస్తం, రవాణాభత్యం బిల్లుల్లోకూడా అంగన్వాడీల నుంచి కమీషన్లు వసూలుచేస్తున్నారు. కేవలం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల ద్వారానే స్వాహాచేస్తున్న సొమ్ము నెలకు కోటిరూపాయలకు పైగా ఉందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 3,774 అంగన్వాడీ కేంద్రాల్లో 3,400 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. వారితోపాటు మరో 3,100మంది ఆయాలు ఉన్నారు. ఈ అంగన్వాడీల పరిధిలో 2.27 లక్షల మంది పిల్లలు, 26 వేలమంది బాలింతలు, మరో 28,500 మంది గర్భిణులున్నారు. వీరికి ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు, పాలు, గుడ్డు, బియ్యం, పప్పుదినుసులు అందజేస్తోంది. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులకు పప్పుతో కూడిన అన్నం, కోడిగుడ్డు అందిస్తున్నారు. సాయంత్రం అల్పాహారంగా గుగ్గిళ్లు, వడియాలు పెడుతున్నారు. సూపర్వైజర్లను పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో కొంతమంది సూపర్వైజర్లు అవినీతికి పాల్పడుతూ అంగన్వాడీల నుంచి పప్పు, బియ్యం, కోడిగుడ్లు, నూనె, పౌష్టికాహారం తీసుకుని నల్ల బజార్లకు తరలిస్తూ పెద్ద మొత్తంలో గడిస్తున్నారు. పైగా ఈ అవినీతి సొమ్ము తమకు ఒక్కరికే కాదని కింది స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు అందించాలని బుకాయిస్తున్నారు. బిల్లుల్లోనూ స్వాహా.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు రవాణాభత్యం, కేంద్రాల అద్దె, వంటచెరకు బిల్లులకు సంబంధించి అధికారులు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఒక్క జీతంలో తప్ప మిగతా అన్నింటిలోను వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమిటని అడిగిన కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారు. వీటితోపాటు అమృతహస్తం పథకం కోసం ఇచ్చే కూరగాయలు, పాలబిల్లుల్లో కూడా తమకు కమీషన్లు ఇవ్వాలని కొంత మంది సూపర్వైజర్లు పట్టుబడుతున్నారు. దీనిని సహించలేని కొంతమంది కార్యకర్తలు సంబంధిత సూపర్వైజర్లపై పై అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలంలోని ఓ సూపర్వైజర్ వసూళ్ల దందాను నిరసిస్తూ నేరుగా ఆ ప్రాజెక్టు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. సరుకులు పక్కదారిపట్టిస్తే చర్యలుతప్పవు చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందించే సరుకులు పక్కదారి పట్టించే వారిపై చర్యలు తప్పవు. దీనికి ఎవరు బాధ్యులైనా విచారించి తగు చర్యలు తీసుకుంటాం. వెంకటసుబ్బమ్మ, సీడీపీఓ ఉదయగిరి -
ఆగనున్న ప్రగతి రథ చక్రం
రాష్ట్ర విభజన సీమాంధ్రలో ఆర్టీసీ విధ్వంసానికి దారి తీయనుంది. తెలంగాణలో సామాజిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అక్కడి ఆర్టీసీ డిపోలు లాభాల్లో నడుస్తున్నాయి. అలాగే ఆర్టీసీకి సంబంధించి రూ.20 వేల కోట్ల ఆస్తుల్లో రూ.15 వేల కోట్ల ఆస్తి తెలంగాణలో నే ఉంది. సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్నప్పటికీ అక్కడి లాభాలతో ఇక్కడి కార్మికులు సైతం ప్రతి నెలా జీతాలు తీసుకోగలుగుతున్నారు. విభజన జరిగితే కార్మికులు మెరుగైన వైద్యం, పదోన్నతులతో పాటు కొందరు ఉద్యోగాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అంటే సీమాంధ్రలో ఆర్టీసీ ప్రగతి దీపం ఆరిపోనుంది. నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రభావం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపనుంది. రీజియన్ పరిధిలో పది డిపోల్లోని 860 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మెలో ఉండటం, పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్స్ అసోసియేషన్ సైతం సమ్మెబాట పట్టడంతో జిల్లాలో ఆర్టీసీ తీవ్రనష్టం చవి చూస్తోంది. 33 రోజులుగా ఆర్టీసీ రోజుకు రూ.10 లక్షల ఆదాయాన్ని కోల్పోతోంది. సుమారు రూ.70 లక్షల రాబడిని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో అతిపెద్ద రవాణ సంస్థగా పేరుగాంచిన ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర విభజనతో రెండు ముక్కలై తెలంగాణకు కాసుల పంట కురిపించే కామధేనువుగా మారుతుంది. అదే సమయంలో సీమాంధ్రలో 13 జిల్లాల పరిధిలోని 70 వేల మంది కార్మికుల, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక, భౌగోళిక పరిస్థితులననుసరించి తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం, సరైన రైలు మార్గం లేకపోవడంతో అక్కడి ప్రజలకు కేవలం ఆర్టీసీ బస్సులే ప్ర త్యామ్నాయం అయ్యాయి. దీంతో తెలంగాణ ప్రాంత పరిధిలోని 100 డిపోల పరిధిలో 10 వేల బస్సులు నిత్యం లాభాలు ఆర్జిస్తున్నాయి. అయితే సీమాంధ్రలో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు, అన్ని జిల్లాల్లో రైలు మార్గాలు, ట్రావెల్ బస్‌ల నిర్వాహకుల రాజకీయ ప్రాబల్యం, గ్రామీణ ప్రాంతాల్లో లెక్కకు మించిన ఆటోల రద్దీతో ఆర్టీసీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ 5 వేల కోట్లు అప్పుల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఆస్తుల్లో కేవలం తెలంగాణలో రూ.15 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి. తెలంగాణలో వచ్చే ఆదాయంతో ప్రతినెలా ఉద్యోగులు, కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇవ్వగలుగుతోంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో కార్మికులకు 3 నెలలకొక సారైనా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరి తొలగించాల్సి ఉంటుంది. కొత్తగా నియామకాలుండవు. ఉద్యోగులు పదోన్నతుల అవకాశం కోల్పోతారు. ప్రస్తుతం ఇస్తున్న జీతాల్లో కూడా కోత విధించే పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు మెరుగైన, అధునాతన వైద్యసేవలందిస్తున్న 300 పడకల ఆస్పత్రి, కార్మికుల కోసం ప్రభుత్వం అనుసంధానమైన 7 కార్పొరేట్ ఆస్పత్రులు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఆర్టీసీకి ప్రధాన కార్యాలయం, బస్ భవన్, ముద్రణాలయం తదితర కార్యకలాపాలన్నీ కూడా హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నారు. విభజన జరిగితే ఈ కార్మికులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే పరాయి రాష్ట్రంలో కాలుపెట్టినట్టే అవుతుంది. ప్రస్తుతం సీమాంధ్ర డిపోల బస్సులు 23 జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా యథేచ్ఛగా తిరగగలుగుతున్నాయి. విభజన జరిగితే హైదరాబాద్‌కు వెళ్లాలంటే రెట్టింపు పన్ను చెల్లిస్తే తప్ప వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో పరోక్షంగా ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అంతర్రాష్ట్ర భూభాగం పరిధిలో ఒక రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి ఎన్ని కిలోమీటర్లు తిరిగితే పక్క రాష్ట్రం కూడా అన్ని కిలోమీటర్లు బస్ నడపాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి సీమాంధ్రకు వచ్చే బస్సుల సంఖ్య తక్కువ. దీంతో సీమాంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ సైతం పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాల్సి ఉంటుంది. బస్ నిర్మాణానికి సంబంధించి బాడీ బిల్డర్ గ్యారేజీ సైతం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. ఆర్టీసీ కోసం కేంద్ర ప్రభుత్వం అందజేసే జేఎన్యూఆర్ఎం నిధుల్లో భారీకోత విధించాల్సి రావడంతో సీమాంధ్రకు మొండి చేయి మిగులుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 17,400 మంది కాంట్రాక్టు కార్మికుల సర్వీస్ క్రమబద్ధీకరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది. క్రమబద్ధీకరణ కోసం కార్మికసంఘాలతో చేసుకున్న ఒప్పందాలను కొత్త ప్రభుత్వం ఆమోదిస్తుందన్న నమ్మకం లేదు. నెల్లూరు రీజియన్ పరిధిలో 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఆపరేషన్ వర్కర్స్ 4700 మంది, నాన్ ఆపరేషన్ వర్కర్స్ 1500 మంది ఉన్నారు. హైదరాబాద్‌కు 60 బస్సులు రోజూ రవాణా సాగిస్తుంటాయి.