పెంటకుప్పలో ఆడశిశువు
♦ పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
♦ బంట్వారం మండలం తొర్మామిడిలో వెలుగు చూసిన ఘటన
♦ తాండూరు ఆస్పత్రికి తరలించిన అంగన్వాడీ సిబ్బంది
బంట్వారం(వికారాబాద్): అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు పెంటకుప్ప పాలైంది. ఎవరో పాషాణ హృదయులు పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడిలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంత్రం 6 గంటలకు బహిర్భూమికి వెళ్లగా ఆమెకు ఓ చెత్తకుప్పలోంచి పసికందు రోదనలు వినిపించాయి.
దీంతో ఆమె వెంటనే స్థానికులకు విషయం తెలిపింది. సమాచారం అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియమ్మ, లలత, స్వప్న, విజయలక్ష్మితదితరులు అక్కడికి చేరుకున్నారు. ముళ్లపొదలు, చెత్తకుప్పలో ఉన్న అప్పుడే పుట్టిన ఆడపిల్లను గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశివు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పాప బరువు రెండు కేజీల కంటే తక్కువగా ఉన్నందున 10 రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. అనంతరం నగరంలోని శిశు విహార్‌కు తరలించనున్ననట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ జగదాంబ తెలిపారు. అయితే, గ్రామానికి చెందిన గుర్తుతెలియని మహిళ ఆడపిల్ల జన్మించడంతో పెంచుకోవడం ఇష్టం లేక చెత్తకుప్పలో పడేసి వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. లేదా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.