విజయ్ అభిమానుల మద్దతు డీఎంకేకా?
సాక్షి, చెన్నై: రానున్న శాసనసభ ఎన్నిక వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రధాన రా జకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నంతగా గెలుపు కోసం తలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటుడు విజయ్ అభిమానుల మద్దతు డీఎంకే పార్టీకా? అన్న ప్రశ్నకు అవుననే బదులు రావడం కోలీవుడ్లోనూ మరింత ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇళయదళపతి అభిమానులు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు పలు కారణాలు కళ్లెదుట కనబడుతున్నాయి. ఐదేళ్లలో విజయ్ చిత్రాలు పలు సమస్యలకు గురయ్యాయి. దీనికి కారణం అన్నాడీఎంకే ప్రభుత్వమేననే నిర్ణయానికి విజయ్ అభిమానులు వచ్చినట్లు ప్రచారంలో ఉంది.
దీంతో వారు అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పులి చిత్ర విడుదల సమయంలో విజయ్ ఇంటిలో ఐటీ దాడులు జరగడంలో ప్రభుత్వ ప్రయేయం ఉందని విజయ్ అభిమానుల అభియోగాలున్నాయి. ఇత్యాధి కారణాలతో అభిమానులు అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నట్లు సమాచారం. గత 2004 పార్లమెంట్ ఎన్నికల సమయంలో విజయ్ అభిమానసంఘం బీజేపీకి మద్దతు తెలిపింది. 2011 శాసనసభ ఎన్నికల్లో విజయ్,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్లు బహిరంగంగానే అన్నాడీఎంకేకు మద్దతు పలికారు. అలాంటిది ఈ ఐదేళ్ల కాలంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులు వారి అభిమానులకు అన్నాడీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత,అసంతృప్తిని కలిగించాయంటున్నారు.
ఇలాంటి కారణాల వల్లే విజయ్ అభిమానులు డీఎంకే పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై విజయ్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద్ నుంచి సమాచారం వచ్చినట్లు జిల్లా అభిమాన సంఘం సభ్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై విజయ్ గానీ,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్ గానీ ఎలాంటి ప్రకటన చేయకలేదన్నది గమనార్హం.