లోవ ఇన్చార్జి సూపరింటెండెంట్ సస్పెన్షన్
తుని రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాండ్రేగుల వెంకటరమణను సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జారీ చేసిన ఉత్తర్వుల నకళ్లలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కేవీ రమణ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, అధికారుల అనుమతి లేకుండా పనులు చేపట్టడం, అధికార దుర్వినియోగం అభియోగాలపై సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలపై 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. గతేడాది నవంబరు నెలాఖరిలో అప్పటి సూపరింటెండెంట్ వివిధ ఆరోపణలపై శ్రీనివాస్ సస్పెండయ్యారు. దాంతో ఏర్పడిన ఖాళీలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న కాండ్రేగుల వెంకట రమణకు సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగించారు.
అభియోగాలు : ఈఓ అనుమతి లేకుండా ఈ నెల 23న ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించడం.
- విధుల్లో నిర్లక్ష్యం, అందుబాటులో లేకుండా చైర్మన్ వద్ద ఉంటూ పరిపాలనలో సమన్వయం దెబ్బతీయడం.
- నిబంధనలను వక్రీకరించి ధర్మకర్తలను తప్పుదారి పట్టించుట.
- తోటి సిబ్బందిపై ఆరోపణలు చేయుటకు ధర్మకర్తలను ప్రేరేపించడం.
- పూర్వపు టెండరుదారులతో చనువుగా వ్యవహరిస్తూ టెండర్ల ప్రక్రియపై అసంబద్ధ సమాచారం ఇవ్వడం
- అంతర్గత బదిలీల్లో స్వప్రయోజనాలు కలిగి ఉండడం, తనకు ధర్మకర్తల మండలి రక్షణ ఉందని, తనను ఏమి చేయలేరని, తన కోసం అవసరమైతే ధర్మకర్తలు రాజీనామా చేస్తారని, నేను చెప్పినట్టు వినాల్సిందేని తోటి ఉద్యోగులను వేధించడం
- ఈఓ, తోటి సిబ్బందిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు పెట్టడం, ఇతరలను ప్రేరేపించడం.
- ధర్మకర్తల మండలివారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్యోగాలపై వారికి ఆశ కల్పించడం
- ఇంజనీరింగ్ విభాగం అనుమతులు లేకుండా దేవస్థానంలో ధర్మకర్తల మండలి వారితో మైనర్, మేజర్ పనులు చేపట్టవచ్చని తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా దేవస్థానం పరిపాలనకు ఆటంకం కలిగించడాన్ని కారణాలుగా చూపించారు.