మోదీ సూట్ యజమాని దాతృత్వం
ఆగ్రా: సూరత్ వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ పేరు వినే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్‌ను వేలం వేయగా లాల్జీ భాయ్ 4 కోట్ల 31 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సూట్‌పై 'నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ' పేరు కనిపించేలా తయారు చేయడం దీని ప్రత్యేకత. కుబేరుడైన లాల్జీభాయ్ పటేల్ సాయం చేయడంలోనూ ఆయనది పెద్ద మనసు. దేశ వ్యాప్తంగా పేద అమ్మాయిలకు వివాహాలు చేయడం కోసం 200 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా 10 వేలమంది బాలికల తల్లిదండ్రులను ఎంపిక చేసి, అమ్మాయిల వివాహాల కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు లాల్జీభాయ్ చెప్పారు. వచ్చే మార్చి 13న సూరత్‌లో ఈ పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాధ్వి రీతంబరను స్ఫూర్తిగా తీసుకుని పేద పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమం 'బేటీ బచావో, బేటీ పదావో'లో భాగంగా తన వంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు.
లాల్జీభాయ్ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎంతోమందికి సాయపడ్డారు. గతేడాది పేద ఆడపిల్లల కోసం ఓ పథకం ప్రవేశపెట్టారు. గుజరాత్లో పటేదార్ సామాజిక వర్గంలో జన్మించిన 5 వేల మంది బాలికలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల విలువైన బాండ్లు కానుకగా ఇచ్చారు. ఈ బాలికలు 21 ఏళ్ల వయసుకు వచ్చాక 2 లక్షల రూపాయలు తీసుకుంటారు.