ఆర్టీసీ డ్రైవర్ దారుణ హత్య
రాయచోటి టౌన్, న్యూస్‌లైన్: రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ సురేంద్రబాబు(48) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడి భార్య పూజల రాధ, స్థానిక పోలీసుల కథనం ప్రకారం... సంబేపల్లె మండ లానికి చెందిన సురేంద్రబాబు కుటుంబం రాయచోటిలోని జగదాంబ సెంటర్ నుంచి ఎన్జీఓ కాలనీకి వెళ్లే దారిలోని బాలాజీ స్కూల్ వద్ద నివసిస్తోంది.
సంక్రాంతిని పురస్కరించుకుని భార్యతో కలసి స్వగ్రామానికి వెళ్లిన ఆయన బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇందు ముందు కళ్లాపి చల్లి ముగ్గు వేస్తున్న సమయంలో నీళ్లు ఎదురింటి వారి ముందు పడ్డాయి. దీనిపై ఎదురింటి వాళ్లు గొడవకు వచ్చారు. అప్పటికే వీరి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాసు అనే వ్యక్తి తన అనుచరులతో కలసి పథకం ప్రకారం సురేంద్ర ఉంటరిగా ఉన్న అదను చూసి దాడి చేశారు.
వాసు పదునైన కత్తితో నాగేశ్వర, తిరుమలయ్యతో కలసి సురేంద్ర ఛాతిపై పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108లో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడికి భార్యతో పాటు మల్లేశ్వరి, నీలిమా, నితీష్ అనే ముగ్గరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు.