పెన్సిడిల్ సిరప్ అక్రమ రవాణాదారులపై కేసులు
కామారెడ్డి: బంగ్లాదేశ్‌కు పెన్సిడిల్ సిరప్ బాటిళ్లను అక్రమంగా తరలించిన వ్యవహారంలో నిందితులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి తెలిపారు. గత నెలలో బంగ్లాదేశ్‌కు పెన్సిడిల్ సిరప్ బాటిళ్లు సరఫరా చేస్తుండగా దేశ సరిహద్దులలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీనికి సంబంధించి ఏడీ మంగళవారం కామారెడ్డిలోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
డిప్యూటీ డెరైక్టర్ అమృత్‌రావు ఆదేశాల మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన ఏడుగురు ఏడీలు ఈ వ్యవహా రంపై విచారణ జరిపారన్నారు. కామారెడ్డిలో 9, ఆర్మూర్‌లో ఒకటి, నిజామాబాద్‌లో ఆరు దుకాణాల్లో తనిఖీలు జరపగా, కామారెడ్డిలోని అజంతా ఏజెన్సీలోనే అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు. 2013 ఫిబ్రవరి నుంచి పట్టుబడే నాటి వరకు 2.39 లక్షల బాటిళ్లు తెప్పించినట్టు పేర్కొన్నారు. 30 వేల బాటిళ్లకు బిల్లులు కూడా లేవన్నారు. ఈ వ్యవ హారంలో హైదరాబాద్‌కు చెందిన మహేందర్ కీలక పాత్ర పోషించారని వివరించారు.అజంతా ఏజెన్సీ సరఫరా చేసిన 2.39 లక్షల బాటిళ్ల విలువ రూ. రెండు కోట్ల పైమాటేనని పేర్కొన్నారు.