కలిసి జీవిద్దామంటే కాల్చి చంపాడు
వీడిన ఆరిలోవ హత్య మిస్టరీ
మాజీ భార్యను ఉరితీసి, పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రేమ కోసం పెద్దల్ని వద్దనుకుంది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. విభేదాలతో విడిపోయినా మనసు అతన్నే కోరుకుంది. మళ్లీ కలిసి జీవిద్దామని ప్రాధేయపడింది. అదే ఆమె పాలిట శాపమైంది. కలిసి జీవిద్దామన్న మాజీ భార్యను చున్నీతో ఉరివేసి చంపాడా కిరాతకుడు. పెట్రోల్ పోసి దహనం చేశాడు. గత ఏడాది నవంబర్‌లో జరిగిందీ దారుణం. తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ విశాల్‌గున్ని బుధవారం విలేకరులకు అందించిన వివరాలివి.
నర్సీపట్నం, న్యూస్‌లైన్: తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం ఉప్పంపాలెం గ్రామానికి చెందిన సుర్ల రమణ(30) నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మేస్త్రీ పని చేస్తూ జీవించేవాడు. అతనికి కొయ్యూరు మండలం డేగల పాలేనికి చెందిన వై.దుర్గాభవానితో అయిదేళ్ల క్రితం పరిచయమైంది. వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిం ది. వీరిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడం, కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో స్థానిక పెద్దల సమక్షంలో విడిపోయారు.
ఈ దశలో దుర్గాభవానికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె రమణ దగ్గరికి వచ్చేస్తానని తెలిపింది. దీనిపై ఇద్దరి మధ్య నర్సీపట్నంలో వివాదం జరి గింది. ఈ విషయమై మాట్లాడేందు కు గత ఏడాది నవంబరు 10న గొలుగొండ మండలం ఆరిలోవ ప్రాంతానికి ఇద్ద రూ వెళ్లారు. ఆ సమయంలో భవానీని ఆమె చున్నీతోనే ఉరి వేసి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉన్న నర్సింగబిల్లి వెళ్లి రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి మృతదేహాన్ని దహ నం చేశాడు.
ఈ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత స్థానిక పశువుల కాపర్లకు గుర్తుతెలియని విధంగా మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలోనే కె.డి.పేట పోలీస్‌స్టేషన్ లో దుర్గాభవాని అదృశ్యమైనట్టు ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆమె సెల్ఫోన్లో కాల్స్ ఆధారంగా రమణను పట్టుకుని విచారణ చేపట్టడంతో నిందితునిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. ఈ విచారణలో ఎస్ఐ లు, కీలకపాత్ర వహించిన కొయ్యూరు, నర్సీపట్నం సీఐలు సోమశేఖర్, దాశరధి, కె.డి.పేట, గొలుగొండ ఎస్ఐలను ఏఎస్పీ అభినందించారు.