పాపం పసివాళ్లు..!
♦ సుల్తాన్‌బజార్ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
♦ గాంధీలో ఆటోలోనే ప్రసవించిన తల్లి
♦ తల్లిపాలకు నోచుకోని సరోగసీ పిల్లలు
సాక్షి, హైదరాబాద్: పుట్టి పదిహేను రోజులైనా తల్లిపాలకు నోచుకోని సరోగసీ పిల్లలు... పుట్టినా తల్లెవరో తేలని బిడ్డలు... సకాలంలో వైద్యం అందక కన్ను తెరవకుండానే కన్నుమూసిన పసిగుడ్డు... ఆటోలోనే జన్మించిన శిశువు... అత్యాధునిక వైద్య సదుపాయాలకు కేంద్రమైన రాజధానిలో పసివారి ఆక్రందనలివి.
కన్ను తెరవకముందే కాటికి...
మహబూబ్‌నగర్ జిల్లా జీడిపల్లికి చెందిన బండిగయ్య, సరిత దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి తుక్కుగూడలో ఉంటున్నారు. గర్భం దాల్చిన సరిత పురిటినొప్పులు వస్తుండటంతో జూలై 28న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల నుంచి నొప్పులతో బాధపడింది. వైద్యులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. గురువారం తెల్లవారుజామున సాధారణ ప్రసవం ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతో పుట్టిన బిడ్డ కన్ను మూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చని పోయిందని ఆరోపిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆం దోళనకు దిగారు. శిశువు మృతదేహంతో ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఈ అంశంపై ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ శైలజను వివరణ కోరగా... ఆసుపత్రిలో మరణాలు సర్వసాధారణమని చెప్పడం గమనార్హం.
ఆటోలోనే ప్రసవం...
సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన నెహ్రూనాయక్ భార్య ఉష(23) రెండోసారి గర్భం దాల్చింది. పరీక్షించిన వైద్యులు సెప్టెంబర్ నెలలో డెలీవరీ డేట్ ఇచ్చారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోనే కిందపడింది. దీంతో ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. చికిత్స కోసం ఆమెను మారేడు పల్లిలోని షెనాయ్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లగా... పరీక్షించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. నొప్పులతో బాధపడు తున్న ఉషను ఆటోలో తీసుకుని వెళుతుండగా... గాంధీ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆటోలోనే ప్రసవం అయింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గైనకాలజీ విభాగం వైద్యులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకుని తల్లీబిడ్డలను లేబర్‌రూమ్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
తల్లిపాలకు నోచుకోని సరోగసీ పిల్లలు...
నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ ప్రక్రియ నిర్వహిస్తున్న బంజారాహిల్స్‌లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌పై అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సెంటర్లో దాడుల సమయానికి 38 మంది మహిళలు సరోగసీ ద్వారా గర్భం దాల్చడం, వీరిలో నెలలు నిండిన 8 మంది ఖైరతాబాద్‌లోని లోటస్ ఆస్పత్రిలో పదిహేను రోజుల క్రితం పండంటి బిడ్డలకు జన్మనివ్వడం తెలిసిందే. ఈ అంశం వివాదం కావడంతో పుట్టిన బిడ్డల పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో అద్దె తల్లులను సాయికిరణ్ ఆస్పత్రికి తరలించి, పిల్లలను లోటస్ ఆసుపత్రిలో ఉంచారు. ఆకలితో ఏడుస్తున్న పిల్లల బాధ చూడలేక తల్లుల హృదయాలు తల్లడిల్లుతుంటే.. పోషక విలువల్లేని డబ్బా పాలు అరగక కడుపు నొప్పితో పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఈ దృశ్యాలు వారి సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యసిబ్బందిని సైతం కలచివేస్తున్నాయి.
కొలిక్కిరాని తల్లీబిడ్డల అంశం...
సరోగసీ ద్వారా గర్భం దాల్చి ఇటీవల పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తల్లీబిడ్డల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు డబ్బులకు ఆశపడి తన గర్భాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించి, దారుణం గా మోసపోయి, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన విషయం తెలిసిందే.
బాధితురాలికి పుట్టిన బిడ్డకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని, డీఎన్ఏ టెస్టులో బిడ్డ జీన్స్ తమవని తేలితే బిడ్డను తీసుకెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని భావించి న దంపతులు చెప్పడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బిడ్డ సహా తండ్రి లక్ష్మణ్‌కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అప్పటి వరకు తల్లీబిడ్డలిద్దరినీ ఆస్పత్రిలోనే ఉంచాల్సిం దిగా ప్రభుత్వం సూచించడంతో ఆ మేరకు అధికారులు ఆస్పత్రిలోనే ప్రత్యేక వసతి కల్పించారు.