చెత్తపై నిఘా
రాజంపేట: పట్టణాలను, నగరాలను పట్టిపీడిస్తున్న చెత్తసమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తాజాగా ఓ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతోంది. చెత్తపై నిఘా వ్యవస్ధను ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. ఆ దిశగా పురపాలిక, కార్పొరేషన్లో నూతన విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తోపాటు రాజంపేట, బద్వేలు, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు పురపాలికలు ఉన్నాయి.
వీటిలో నూతన విధానానికి సంబంధించి కొన్ని ప్రదేశాలను గుర్తించి నివేదికలు ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో చెత్త తొలిగింపు సక్రమంగా చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఒకరోజు తొలిగిస్తే మూడురోజులు అలాగే ఉంచుతున్నారు. వర్షం కురిస్తే వారంరోజులైనా అక్కడే ఉండిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. చెత్త కుప్పల్లో పశువులు, పందులు చేరడం పరిసరాలన్ని అధ్వానంగా మారుతున్నాయి. ఈపరిస్ధితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఎంబీఎస్ (మాస్టర్ బిన్ సిస్టమ్) పద్దతిని తీసుకొస్తోంది.
సెల్‌ఫోన్ కెమరాతో నిఘా
చెత్త తొలిగింపు పనులకు చెక్ పెట్టేందుకు సల్ఫోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెత్త తొలిగింపుపై సెల్‌ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తే.. ఆ ఫోటో, తొలిగించిన సమయం ఆటోమేటిక్‌గా ఎస్ఎంఎస్ ద్వారా కనెక్టింగ్ కంప్యూటర్‌కు వెళ్లిపోతుంది. ఇందుకు ప్రత్యేకంగా ఆఫ్ సైట్ రియల్ టైమ్(ఓఎస్ఆర్టీ) మ్యానటరింగ్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఎంబీన్ పద్ధతిగా నామకరణం చేసేందుకు పరిశీలిస్తున్నారు. ప్రజారోగ్యం అధికారులు ఖచ్చితంగా అమలుచేసే విధంగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. టెక్నాలజి ఫోన్లు ముఖ్యమైన పబ్లిక్ అండ్ హెల్త్, శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందచేయనున్నారు.
కొత్త విధానం టెక్నాలిజి ఇలా..
పబ్లిక్ అండ్ హెల్త్ ముఖ్య అధికారులకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సామర్ధ్యమున్న సెల్ఫోన్లు ఇస్తారు. వీటిలో ఓఎస్ఆర్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయనున్నారు. అప్లికేషన్లోకి వెళ్లి చెత్తపోగు చేసే పాయింట్లను చిరునామతోపాటు తొలిగించేందుకు నిర్దేశించుకునే సమయాన్ని నమోదు చేయాలి. నమోదైన సమాచారం కనెక్టింగ్ పర్సన్‌కు వెళుతుంది. ప్రతి రోజు అధికారులు చెత్తపాయింట్ వద్దకు వెళ్లి తొలిగించిన దృశ్యాన్ని సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించాలి. ఏ రోజైనా ఒక పాయింట్లో చెత్తను తొలిగించలేదంటే వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులకు తెలుస్తుంది.
దీనిపై బాధ్యులైన వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓఎస్ఆర్టీ మానిటరింగ్ సిస్టం అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ కావాలనేందుకు ఆరు మార్గదర్శకాలను సూచించారు. డస్ట్‌బిన్ డంప్‌బిన్స్ లేద చెత్త లిఫ్టింగ్ పాయింట్లు రిజిష్టరు చేయాలి. చెత్త తొలిగింపు ఫోటోలు ఎలా అన్లోడ్ చేయాలనే దానికి ఏడు మార్గదర్శకాలను నిర్దేశించారు. అన్ని మున్సిపాలిటిలో అమలు చేసేందుకు ప్రాసెస్ చేస్తున్నామని రీజనల్ స్ధాయి అధికారి ఒకరు ధ్రువీకరించారు.