పక డ్బందీగా కుటుంబ సర్వే
మహబూబ్‌నగర్‌టౌన్: సమగ్ర కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సర్వే నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు 19వరకు ఎట్టి పరిస్థితులలో మండలాలను విడవ రాదన్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో టాంటాం వేయించాలని, పత్రికలు, ఎలక్ట్రానిక్ చానళ్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీలు, హోటళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో సర్వేపై బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సర్వేపై అవగాహణ కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులను చైతన్యం చేయూలన్నారు. సినిమా హాళ్లలో స్లైడ్స్ వేయించాలన్నారు. సర్వేపై జిల్లా వ్యాప్తంగా 11వేల గోడ పత్రికలు పంపిణీ చేయనున్నామని, వాటిని సరైన ప్రాంతాల్లో అతికించాలని సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వేపై ఈనెల 7నుంచి మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తామని,అనంతరం ఇతరులకు శిక్షణ ఉంటుందన్నారు. ప్రత్యేకాధికారులు సర్వేకు సంబందించిన రూట్‌మ్యాప్, వాహనాలపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు అధికారులందరూ సమగ్ర కుటుంబ సర్వేను ఎన్నికల డ్యూటీలా భావించి జిల్లాలో విజయవంతం చేయూలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, ఏజెసి రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, జెడ్పీసీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.