'లైంగిక' ఆరోపణలున్న వ్యక్తికి 'పద్మశ్రీ'నా ?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతినికేతన్ లోని విశ్వభారతీయూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ సుశాంత్ దత్తగుప్తకు పద్మ పురస్కారం ప్రకటించడం పట్ల పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. సుశాంత్‌కు ప్రకటించిన పద్మ పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ చైర్మన్ సునందా ముఖర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు లేఖ రాశారు.
పద్మ పురస్కారాలు అత్యున్నతమైనవని వాటిని వివిధ రంగాలలో రాణించిన వారికి అందజేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే ఆ పురస్కారాన్ని అందుకునే అర్హత సుశాంత్‌కు లేదని సునంద ఆ లేఖలో వెల్లడించారు. సుశాంత్‌కు పద్మ పురస్కారం ప్రకటించడంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జాతీమ మహిళ కమిషన్‌కు లేఖ రాసినట్లు వివరించారు. వివిధ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రప్రభుత్వం ఆదివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అసలు ఏం జరిగింది: 2005లో సుశాంత్ దాస్‌గుప్తా సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో ఆ సంస్థలో పని చేస్తున్న మహిళ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుశాంత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.