షాపింగ్ కు వెళ్లిన హౌస్ సర్జన్ కిడ్నాప్
* కడపలో అదృశ్యమైన సుస్మిత
* దుండగులు ఆటోలో తీసుకెళ్లారని అనుమానాలు
* సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలిస్తున్న పోలీసులు
కడప అర్బన్: కడప శివార్లలోని రిమ్స్‌లో హౌస్ సర్జన్‌గా విద్యనభ్యసిస్తున్న సుస్మిత నగరంలోని నాగరాజుపేట వద్ద శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. సహచర విద్యార్థులు, పోలీసులు వివరాల మేరకు..
ఆదిలాదాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన కేఎస్ ముత్తన్న కుమార్తె కొత్తూరు సుస్మిత రిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫైనలియర్ (హౌస్ సర్జన్) చదువుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు తన సహచర హౌస్ సర్జన్ సాధనారెడ్డితో కలసి నగరానికి ఆటోలో వచ్చింది. నాగరాజుపేటలోని గంగవరం రెసిడెన్సీ సమీపంలో ఉన్న బ్యూటీ పార్లర్ వద్ద సుస్మిత దిగింది. సాధన వైవీ స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకుని వస్తానని వెళ్లింది. ఎనిమిది గంటలకు సాధానరెడ్డి సుస్మితకు ఫోన్ చేయగా, తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఏడుస్తూ మాట్లాడటంతో ఆమె కంగారుపడింది.
మరో సారి ఫోన్ చేయగా ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది. విషయాన్ని సాధన తన సహచర హౌస్సర్జన్లకు చెప్పింది. అనంతరం కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఓఎస్డి రాహుల్‌దేవ్ శర్మ, డీఎస్పీ ఇ.జి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్ నాగరాజుపేట వైపు నుంచి పాత బస్టాండు, మరియాపురం, మైదుకూరు వైపు వెళ్లినట్లు సమాచారం. అయితే తనను ఎవరో కిడ్నాప్ చేశారని సుస్మిత నిర్మల్‌లోని తన సోదరునికి చెబుతుండగా మధ్యలో దుండగులు ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. సుస్మిత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదని, తన పని తాను చేసుకుపోయేదని రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ చెప్పారు.