చిన్నారి పూజ హత్యపై పలు సందేహాలు
⇒ అంతా అనుమానాస్పదమే..!
⇒ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు ‘క్షుద్రపూజల’ వ్యవహారం!
⇒ వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందా..?
⇒ పూజ తల్లి లక్ష్మి పొంతన లేని సమాధానాలు
⇒ నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు
⇒ అక్కంపల్లిని సందర్శించిన ఎస్పీ శ్రీనివాసులు
యాలాల: చిన్నారి పూజ హత్య కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో పూజ(1)ను హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించేందుకు గుప్తనిధులు, క్షుద్రపూజల వ్యవహారం తెర మీదకు తీసుకువచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. మండల పరిధిలోని అక్కంపల్లిలో చిన్నారి పూజ గురువారం అర్ధరాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా గొంతు నులిమి వేయడంతోనే పూజ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. శనివారం జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ శివశంకర్ తదితరులు గ్రామానికి చేరుకున్నారు. పూజ తల్లి లక్ష్మితో పాటు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
పొంతనలేని లక్ష్మి మాటలు..
పూజ తల్లి లక్ష్మి చెబుతున్న వివరాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన మైలారం నర్సింలుతో పాటు మాస్క్ ధరించిన మరో గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి తలుపుల గడియ విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారని, అనంతరం తన చేతులు, కాళ్లను తాళ్లతో బంధించి నోట్లో గుడ్డ కుక్కి నుదుటిపై రాయితో కొట్టారని చెప్పింది.
స్పృహ కోల్పోయి వాకిట్లో ఉన్న తనను మరుసటి రోజు తెల్లవారుజామున ఇరుగుపొరుగు నిద్ర లేపడంతో తాళ్లను విప్పుకొన్నానని తెలిపింది. కాగా లక్ష్మి మాటలు నమ్మశక్యంగా లేవని ఎస్పీ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. లక్ష్మి వద్ద నర్సింలు ఫోన్‌నంబర్ ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వారిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగిందని పోలీసుల విచారణలో తేలింది. వారి వ్యవహారం బెడిసి కొట్టడంతో గురువారం రాత్రి లక్ష్మి ఇంటికి వచ్చిన నర్సింలు ఆమెతో గొడవకు దిగి ఉండవచ్చని, ఈక్రమంలో పూజ హత్యకు గురై ఉంటుందని ఎస్పీ శ్రీనివాసులు అనుమానం వెలిబుచ్చారు.
నర్సింలు వ్యవహారంపై గ్రామస్తుల అనుమానం..
కాగా ఈ ఘటనలో నిందితుడు మైలారం నర్సింలు వ్యవహారంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నర్సింలు గుప్త నిధులు, క్షుద్రపూజలు అంటూ ఎప్పుడూ చెబుతుండేవాడని, పూజ హత్య కూడా ఈ కోణంలోనే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నర్సింలు ఎప్పుడూ గ్రామ శివారులోని రామస్వామి ఆలయ పరిసరాలలో ఒంటరిగా తిరుగుతూ, ఆలయానికి వచ్చే వారిని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుండేవాడని చెబుతున్నారు.
తరచూ అపరిచితులను గ్రామానికి తీసుకొచ్చి గుప్తనిధుల గురించి చర్చిస్తుండేవాడన్నారు. గతంలో లక్ష్మి, నర్సింలు మధ్య వివాహేతర సంబంధం ఉండేదన్నారు. అభంశుభం తెలియని ఏడాది చిన్నారి హత్యకు గురవడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఎస్పీ శ్రీనివాసులును కోరారు. కాగా గుప్త నిధుల వ్యవహారంలోనే పూజ హత్యకు గురైందనే విషయాన్ని ఎస్పీ కొట్టిపడే శారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన నర్సింలు పట్టుబడితేనే మిస్టరీ మొత్తం వీడుతుందన్నారు.
మూఢ నమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు..
ఎస్పీ శ్రీనివాసులు గ్రామస్తులతో మాట్లాడారు. మూఢ నమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. సాంకేతిక యుగంలో మూఢ నమ్మకాలను విశ్వసించడం దారుణమని ఆయన చెప్పారు. మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉండటం, ఏ చిన్న సంఘటన జరిగినా అది బాణమతి, చేత బడి అని నమ్మడం సరికాదన్నారు.
పూజ హత్య కేసును దారి మళ్లించేందుకు గుప్తనిధులు, క్షుద్రపూజలను తెరమీదికి తీసుకొచ్చారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ చెప్పారు. నర్సింలు పరారీలో ఉన్నాడని, ఆయన కుటుంబీకులను అదుపులోకి తీసుకొని సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం మూడు టీంలు గాలిస్తున్నాయని, త్వరలో నిందితుడిని పట్టుకొని చిన్నారి హత్య మిస్టరీని ఛేదిస్తామన్నారు. మూఢ నమ్మకాలను పారదోలేందుకు గ్రామంలో కళాజాత బృందంతో పాటు డిజిటల్ టెక్నాలజీతో లఘుచిత్రాలను ప్రదర్శించనున్నుట్లు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.