బ్లాక్‌బలి..
– అభిమానుల సొమ్ముతో జూదం
– ఎస్వీ థియేటర్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
అనంతపురం కల్చరల్ : భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న బాహుబలి 2 సినిమా అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకునే విషయంలో అంతే స్థాయిలో వివాదస్పదమవుతోంది. ఇప్పటికే టిక్కెట్టు ఖరీదు రూ.1000ల నుంచి రూ.2000లకు వెళ్లిపోయినా గత నాలుగు రోజులుగా బారులు తీరి టిక్కెట్లు కొంటుండటం విశేషం. చిన్న సినిమాలకు అవకాశమివ్వకుండా నగరంలోని దాదాపు అన్ని థియేటర్లలోబాహుబలి విడుదలవుతోంది. దానికి తోడు నిబంధనలకు నీళ్లు వదులుతూ రోజుకు నాలుగు ఆటలు మాత్రమే సాగాలన్న నియమం పక్కన పెట్టి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆరు ఆటలు ఆడనుంది. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు సినీ అభిమానుల్ని దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాలు స్థానిక ఎస్వీ సినీ కాంప్లెక్స్‌ను గురువారం ముట్టడించాయి. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీగా వచ్చి థియేటర్ ముట్టడికి ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అంతకు ముందు విద్యార్థి సంఘం నాయకులు ప్రసాద్, రమణ, మధు, మనోహర్ తదితరులు మాట్లాడుతూ వినోదంతో వ్యాపారం చేస్తున్న థియేటర్ యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నా అడిగే దిక్కు లేకపోవడం దారుణమన్నారు. టిక్కెట్ ధరలు తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నగరంలోని థియేటర్ల యాజమాన్యాలు దందాకు పాల్పడుతుంటే పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. మధ్య తరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే భయపడిపోవాల్సి వస్తోందని వెంటనే కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు కలుగజేసుకుని దందాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. థియేటర్ ముట్టడిలో చాంద్‌బాషా, ఆనంద్, జమీర్, సంతోష్, రాకేష్, కుళ్లాయస్వామి, పవన్ తదితరులు పాల్గొన్నారు.