నేటి నుంచి జాతీయ సదస్సు
పెనుగొండ : తెలుగులో మహిళా రచయితల అనుభవాలు–ప్రభావాలు అంశంపై మహిళా రచయితల జాతీయ సదస్సు పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళా రచయితల మధ్య పరస్పర సంభాషణకు, భావ వినిమయానికి అవకాశం కల్పించడం, సమకాలీన రాజకీయ ఆర్థిక పరిణామాలకు, సాహిత్యానికి పరస్పర సంబంధాన్ని చర్చించడం, మహిళా రచయితల సాహిత్య వస్తు శిల్పాల తీరుతెన్నులను విశ్లేషించడమే సదస్సు లక్ష్యమన్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కలిదిండి అన్నపూర్ణ సదస్సును ప్రారంభిస్తారని, కాకినాడ ఐడియల్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు డాక్టర్ పుట్ల హేమలత, కార్యదర్శి కాత్యాయినీ విద్మహేల, వివిధ జిల్లాలకు చెందిన రచయిత్రులు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్ పాల్గొంటారన్నారు