స్వచ్ఛ సిరిసిల్లకు కేంద్రమంత్రి అభినందన
రాష్ట్రానికి సాయం చేస్తామన్న బీరేంద్ర సింగ్
కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బహిర్భూమిలేని నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావును కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ మంత్రి బీరేంద్రసింగ్ అభినందించారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన ఆయన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బీరేంద్ర మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. సిరిసిల్ల స్ఫూర్తితో ఇతర ప్రాంతాలను కూడా బహిర్భూమిరహిత ప్రాంతాలుగా మార్చేందుకు ముందుకొస్తే ఎలాంటి పరిమితులు లేకుండా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే కృష్ణా, గోదావరి జీవనదుల నుంచి ప్రజలకు సురక్షిత తాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను చేపట్డడం అభినందనీయమన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన వివిధ పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా తెలంగాణకు తగినంత సాయం అందించేందుకు కృషిచేస్తానని బీరేంద్రసింగ్ హామీఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై ఆయన ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా గ్రామజ్యోతి, ఈ-పంచాయతీ, వాటర్‌గ్రిడ్, హరితహారం తదితర కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు.