‘స్వచ్ఛ్ భారత్’ దూతలుగా బాలు, పవన్!
ఎంపీ కవిత, హీరో నితిన్, అమల, వీవీఎస్ లక్ష్మణ్ కూడా..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 9 మంది చొప్పున పలు రంగాల ప్రముఖులు దూతలు(అంబాసిడర్లు)గా ఎంపికయ్యారు. ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(బాలు) సహా పలువురికి ఈ జాబితాలో చోటు కల్పించారు.
స్వచ్ఛ్ భారత్ దూతలుగా ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, అమల, క్రీడా రంగం నుంచి వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్రావు, జీవీకే రెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించనున్నారు.
అదేవిధంగా లక్ష జానాభాకు మించిన అన్ని దక్షిణాది నగరాల మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశాలు నిర్వహించి స్వచ్ఛ్ భారత్ సహా పలు కార్యక్రమాలపై చర్చించనున్నారు.