Swami Dayananda Saraswati
-
సత్యార్థ ప్రకాశకులు స్వామి దయానంద సరస్వతి
పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి. దయానందుల అసలు పేరు మూల శంకర్. చిన్ననాడే భగవంతుడ్ని దర్శించాలనే తలంపుతో ఇల్లు వదలి వెళ్లి మధురలోని విరజానంద సరస్వతుల వద్దకు చేరారు. వారి సాన్నిధ్యంలో వేద, వేదాంత విద్యలను అభ్యసించి, సమాజం పట్ల అవగాహన రావడానికి గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు. ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిన దయానంద తన జీవితం ఇక సమాజసేవకే అంకితమని నిశ్చయించుకున్నారు. సంఘసంస్కారం–ఆర్యసమాజం: దయానంద సరస్వతి సతీ సహగమనం, బాల్యవివాహాలపై తీవ్రంగా పోరాడి జనాలలో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మను గట్టిగా విశ్వసించే దయానందులు ఆచార వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు. ఆర్యసమాజాన్ని స్థాపించి స్త్రీ జాతి సముద్ధరణకు నడుం బిగించారు. స్వధర్మానికి తిరిగి చేరుకునే వారికోసం ఆర్యసమాజం ద్వారా శుద్ధి కార్యక్రమం నిర్వహించేవారు. వీరు చేపట్టిన సంస్కరణలకు ఆనాటి ప్రముఖ నాయకులు సైతం ప్రభావితమయ్యారు. దయానంద భాష్యం: వేదాలు మానవులు రచించినవి కావనీ, సాక్షాత్తూ పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మిన వీరు ‘సత్యార్థ్ ప్రకాశ్’ పేరుతో వేదాల సారాన్ని సామాన్యుడి దాకా చేర్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో వేదాలకు వీరు రాసిన భాష్యం ‘దయానంద భాష్యం’ పేరుతో సుప్రసిద్ధమైంది. వేదాలు చెప్పిన స్త్రీ సమానత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. వేదాలతో పాటు ప్రాథమిక విద్య అవసరాన్ని గుర్తించి అనేక కళాశాలలు నెలకొల్పి విద్యాదానం చేశారు.జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా, మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా అవిరళ కృషి సల్పి, హిందూధర్మానికి దయానందులు చేసిన సేవ తరువాతి సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది. (నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి) -అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు చదవండి: వివాహ బంధం: బ్రహ్మముడి అంటే...? ‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి -
స్వామి అస్తమయం
మహాసమాధి చెందిన స్వామి దయానంద సరస్వతి శోకసంద్రంలో మంజకుడి తల్లడిల్లిన తమిళనాడు చెన్నై, సాక్షి ప్రతినిధి:స్వామి దయానంద సరస్వతి మహా సమాధి చెందిన సమాచారంతో తమిళనాడులోని ఆధ్యాత్మిక లోకం తల్లడిల్లిపోయింది. పండితులనేగాక పామరులను సైతం ఆధ్యాత్మిక బోధనలతో తనవైపు తిప్పుకున్న స్వా మి ఉపన్యాసాలను తలచుకుంటూ ఘన ని వాళుర్పించింది. కోయంబత్తూరులోని స్వా మి ఆశ్రమానికి చెందిన శిష్యబృందం భజ నాది కార్యక్రమాలతో మునిగిపోయింది.స్వదేశీయులనే కాదు, విదేశీయులను సైతం తన ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో మంత్రముగ్ధులను చేసి కోట్లాది శిష్యగణాన్ని సంపాదించుకున్న స్వామి దయానంద సరస్వతి తమిళనాడుకు చెందిన వారు కావడాన్ని గర్వంగా భావిస్తారు. సినీ ప్రేక్షకలోకం నుంచి నీరాజనాలు అందుకుంటున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం స్వామి సన్నిహిత శిష్యుడు కావడం కూడా విశేషం. సినిమా షూటింగుల్లో విరామం దొరికినపుడల్లా ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని స్వామివారి ఆశ్రమంలో కొంతకాలం గడపడం రజనీకాంత్ తన దైనందిన జీవితంలో ప్రధానమైనదిగా భావిస్తారు. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే అన్నచందంగా దేశ విదేశాల్లో కోట్లాది మంది స్వామివారి కృపకు పాత్రులైనా తమిళనాడు ప్రజలు మాత్రం తమస్వామి అంటూ సగర్వంగా సొంతం చేసుకుంటారు. తిరువారూరు జిల్లా మంజకుడి అనే గ్రామానికి చెందిన గోపాల్ అయ్యర్, వేలమ్మాళ్ దంపతులకు 1930 ఆగష్టు 15వ తేదీన జన్మించిన నటరాజన్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా బాల్య దశ నుంచే ఆధ్యాత్మికత భావాలను కలిగి ఉండేవారు. కాలేజీ చదువు ముగియగానే స్వామి చిన్మయానంద స్వామి వద్ద 1962లో సన్యాసం స్వీకరించారు. ఆ త రువాత నటరాజన్ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నారు. పుట్టిన గడ్డకు ఏమైనా చేయాలనే సంకల్పంతో కోయంబత్తూరు జిల్లా ఆనైకట్టిలో 1990లో ఆర్షవిద్య గురుకులాన్ని స్థాపిం చారు స్వామి దయానంద సరస్వతి. పేదలకు సాయం చేసేందుకు ఎయిమ్బార్ సేవ అనే సంస్థను స్థాపించి దేశం నలుమూలలా విస్తరించారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించారు. తన స్వగ్రామమైన ఆనైకట్టిలోని ఆశ్రమం నిర్మించిన తరువాత నుంచి తన జీవితకాలంలో ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడిపేవారు. ఊపిరితిత్తుల వ్యాధితో మూడు నెలలుగా మూడునెలలుగా బాధపడుతున్న స్వామి కొన్ని రోజుల క్రితం అమెరికాలో చికిత్స పొందారు. అక్కడి నుండి నేరుగా రిషీకేష్ ఆశ్రమానికి చేరుకున్నారు. మరణం సమీపిస్తున్నదని ముందుగానే గుర్తించిన స్వామి తన సమాధి స్థలాన్ని సైతం ఎంపికచేశారు. సమాధి నిర్మాణం పనులను స్వామి ప్రారంభించారు. సమాధి పనులు పూర్తవుతున్న దశలో స్వామి దైవలోక ప్రాప్తి చెందారు. స్వామి మహాసమాధి అయిన సమాచారం అందుకున్న ఆయన స్వగ్రామస్తులు బుధవారం రాత్రి నుంచే భజనలు నిర్వహిస్తూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఆనకైకట్టిలోని ఆయన ఆశ్రమం శోక సంద్రంలో మునిగిపోయింది. వేలాది మంది శిష్యులు స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ప్రార్దనలు జరుపుతున్నారు. స్వామివారి శిష్యుల కుటుంబాలు తీరనిశోకంలో మునిగిపోయాయి. స్వామివారి ఫోటో ముందుంచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. రజనీకాంత్ శ్రద్ధాంజలి స్వామి మహాసమాధి చెందిన వార్త తెలుసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూజ్యశ్రీ దయానంద స్వామీ మమ్మల్ని ఆశీర్వదించండి, మిమ్మల్ని దూరం చేసుకోవడం తట్టుకోలేని బాధను కలిగిస్తోంది. మీ పాదపద్మాల వద్ద మా ప్రార్థనల్లో సమర్పించుకుంటున్నాము. ఎప్పటికీ మాతోనే ఉండండి అంటూ రజనీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.