ఆచరణే అసలు పాఠం!
కాలిఫోర్నియాలో స్వామీ రామా అనే ఉత్తర హిందుస్థానీయుడు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అనే సంస్థను నడిపాడు. హిమాలయాల్లో యోగిగా జీవిస్తూ, గురువువద్ద చాలా కఠినమైన శిక్షణ పొందాడు. ఆ శిక్షణలో తాను పొందిన అనుభవాలను, వాటినుంచి తాను నేర్చుకున్న అంశాలను ఆయన చెప్పారు. ఒకసారి స్వామీ రామాతో గురువు ‘ఆకాశం వంక చూస్తూ నడువు’ అన్నాడు. ‘అదేమిటి అలా అంటారు? ఆకాశం వంక చూస్తూ నడుస్తూంటే తడబడి కింద పడనా?’ అని అన్నాడు రామా. ‘అయితే, తల దించుకుని నడువు. అప్పుడు తడబడాల్సిన అవసరం లేకుండా నడవవచ్చు. ప్రమాదభరిత యాత్రలో ముందుకు సాగడానికి నీవు నమ్రత కలిగివుండాలి. నమ్రత లేకపోతే ఏమీ నేర్వలేవు. నీ ఎదుగుదల అక్కడికక్కడే ఆగిపోతుంది’ అని గురువు చెప్పారు.
హిమాలయ కొండల్లో రోజుకొకసారే భోజనం అంటారు స్వామీ రామా. ఒక్క చపాతీ, కాసిని కూరముక్కలు, ఓ కప్పు పాలు. ‘నేను అన్నానికి కూచొని ప్రారంభించబోతుండగా మా గురువు వచ్చి నాతో ఇలా అన్నారు: ‘వృద్ధుడైన ఓ స్వామి వచ్చారు. ఆకలిగొని ఉన్నాడు. నీ ఆహారం అతడికివ్వాల్సి ఉంటుంది’. ‘నేనూ ఆకలిగానే ఉన్నాను. ఇది వదులుకున్నానంటే, రేపటిదాకా నాకింకేమీ ఉండదు. అందువల్ల ఇవ్వలేను’ అన్నాను.
‘ఆ కాస్తకూ చచ్చిపోవులే. అతడికిచ్చెయ్. ఇచ్చేటపుడు ఇప్పటి ఈ మనసుతోకాక, నీ ప్రేమ కానుకగా ఇవ్వు’ అన్నాడు. ‘నేను ఆకలితో ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని ఇంకొకరికి ప్రేమ కానుకగా ఎలా ఇవ్వను?’ అన్నాను. ఎంత చెప్పినా నేను వినకపోయేసరికి, ‘నిన్నిలా చేయమని ఆజ్ఞాపిస్తున్నాను!’ అన్నారు మా గురువు. వచ్చిన వృద్ధుడి గడ్డం తెల్లగా ఉంది. కాళ్లకి పావుకోళ్లు, కంబళీ, చేతికర్రతో కనిపించాడు. కొండల్లో ఒంటరిగా తిరుగుతున్నాడట. ‘మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కుర్రవాణ్ణి ఆశీర్వదించండి’ అన్నారు గురువు. ‘అతడికి మంచినీళ్లిచ్చి, నీళ్లతో కాళ్లుకడుగు’ అన్నాడు నా గురువు. నాకిష్టం లేకపోయినా ఆయన చెప్పినట్లు చేశాను. దాని అర్థమేమిటో అప్పటికి నాకు తెలియలేదు. ఆయన్ని కూర్చోబెట్టి నేను తినబోయిన ఆహారం అతనికి పెట్టాను.
అతడు నాలుగురోజులుగా ఆహారం లేకుండా ఉండిపోయిన సంగతి తర్వాత తెలిసింది. అతడు ఆహారం పుచ్చుకున్న తర్వాత ఇలా అన్నాడు, ‘భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఆహారం నీ ముందుకువచ్చినప్పుడు తప్పితే జీవితంలో నువ్వెన్నడూ ఆకలిగొనకుందువుగాక, ఇదీ నా దీవెన’ అన్నాడు. ఆ దీవెన ఫలించింది. ‘అతడి కంఠస్వరం ఈ నాటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆనాటినుంచీ కోరికలతో సతమతమయ్యే నా తత్వంనుంచి విముక్తి చెందాను’ అంటాడు స్వామీ రామా.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్