సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
కథలాపూర్(వేములవాడ): దేశ సంస్కృతిని ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయని, హిందు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. మంగళవారం కథలాపూర్ మండలంలో భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వివేకానందుడు దేశం గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు చాటిచెప్పారని, ఆయన దేశంలో జన్మించడం గర్వకారణని పేర్కొన్నారు. హిందు ధర్మం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విభిన్న భాషలు మాట్లాడేవారు దేశంలో ఉన్నారని, రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవడంతో ధర్మం, న్యాయం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి తన గురువు అయిన రాముడి కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారి చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందు ధర్మం అన్ని వర్గాలవారిని, మతా లవారిని సమానంగా ఆదరిస్తుందన్నారు. అనంతరం భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండలకేంద్రం నుంచి భూషణరావుపేట, చింతకుంట, దుంపేట, పోసానిపేట, తాండ్య్రాల గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.