ధైవనామస్మరణతోనే మోక్షం
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కలియుగంలో నిరంతరం దైవనామ స్మరణమే మోక్షానికి మార్గమని స్వామి కమలానంద భారతి పేర్కొన్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ మహాసభల్లో ఆదివారం ఆచార్య శ్రీహరి తీర్థస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. సనాతన భారతీయ సంస్కృతిలో ఐక్యతనే ైదె వ గుణంగా చెప్పారని, నేడు కుటుంబాలు, మనుషులు అడ్డుగోడలు పెంచుకుని అలమటిస్తున్నారన్నారు. స్వామి శ్రీహరి తీర్థ మాట్లాడుతూ తైత్తిరీయోపనిషత్తు మనకు తల్లి,దండ్రి, గురువు అతిథులను దైవంగా సేవించాలని సూచించిందని చెప్పారు.
స్వామి విరిజానందగిరి మాట్లాడుతూ భక్తిలేకపోతే కర్మ, జ్ఞానాలు ఫలించవన్నారు.
స్వామి నిశ్శ్రేయసానందగిరి మాట్లాడుతూ ప్రతి జీవి ఆత్మస్వరూపమనే భావనతో మెలగాలన్నారు. మాతా త్యాగీశానందపురి, కృష్ణానందగిరి స్వామి, జగదీశ్వరానందస్వామి, యోగానంద భారతి, సత్యానందగిరిస్వామి, శివానందభారతి, చిత్ స్వరూపానందగిరిస్వామి, స్కందదేవానందగిరిస్వామి భాగవతం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంతో మూడురోజుల మహాసభలు ముగిశాయి.