కిడ్స్‌వేర్‌లోకి మాంటెకార్లో...
♦ ఏడాదిలోగా ఈ విభాగంలోకి ప్రవేశిస్తాం
♦ 2015-16లో 25% వృద్ధి అంచనా
♦ మాంటెకార్లో ఫ్యాషన్స్ {పెసిడెంట్ స్వపన్ దత్తా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న మాంటెకార్లో ఫ్యాషన్స్ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం పురుషులు, మహిళల రెడీమేడ్స్తోపాటు ట్వీన్స్ మాంటెకార్లో పేరుతో 8-14 ఏళ్ల పిల్లల దుస్తులను సంస్థ విక్రయిస్తోంది. ఎనిమిదేళ్లలోపు పిల్లల దుస్తుల మార్కెట్లోకి వచ్చే ఏడాదికల్లా అడుగు పెడతామని మాంటె కార్లో రిటైల్ ప్రెసిడెంట్ స్వపన్ దత్తా తెలిపారు. హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్ షోరూంను జూబ్లీహిల్స్‌లో బుధవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. డిమాండ్ దృష్ట్యా చిన్న పిల్లల దుస్తుల రంగంలోనూ విస్తరిస్తామని చెప్పారు. ట్వీన్స్ ఉప బ్రాండ్ ద్వారా 10% ఆదాయం సమకూరుతోందని తెలిపారు. ఆయనింకా ఏమన్నారంటే..
సీజన్లో 2,000 వెరైటీలు..
కస్టమర్లు విలువను చూస్తారు. పేరున్న బ్రాండ్ దుస్తులను వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో ఎంత కాదన్నా 2,000 వెరైటీలను ప్రవేశపెడుతున్నాం. పూర్తి స్థాయి డిజైనింగ్ టీం ఇందుకు నిమగ్నమైంది. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్‌కు ధీటుగా ఇక్కడ వెరైటీలను తీసుకొస్తున్నాం. యుక్త వయసు యువతుల కోసం మరిన్ని వెరైటీలను ప్రవేశపెడతాం. మహిళల దుస్తుల వాటా టర్నోవర్‌లో 30 శాతం కైవసం చేసుకుంది.
నాణ్యమైన ఉన్నితో..: ఉన్ని దుస్తుల ద్వారా 40 శాత ం ఆదాయం వస్తోంది. ఈ విభాగం 15 శాతం వృద్ధి చెందుతోంది. ఐడబ్ల్యుఎస్ ఊల్మార్క్ ఉన్న నాణ్యమైన వస్త్రాలను అమ్ముతున్నాం. ఉత్పత్తుల ధర రూ.50 వేల వరకు ఉంది. సహజ ఉన్ని దుస్తుల పరిశ్రమ పరిమాణం భారత్‌లో సుమారు రూ.1,500 కోట్లుంటుంది. స్థిరాస్తి రంగం మందగమనం వల్ల రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ గతేడాది 8% తిరోగమన వృద్ధి చెందింది. ఈ ఏడాది పరిస్థితుల్లో మార్పు వస్తోంది. వృద్ధి ఖాయం. మాంటెకార్లోను ప్రమోట్ చేస్తున్న ఓస్వాల్ వులెన్ మిల్స్ దేశ, విదేశీ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తోంది.
25 శాతం వృద్ధి అంచనా..
మాంటెకార్లో 2014-15లో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2015-16లో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశాం. మార్చికల్లా దేశవ్యాప్తంగా కొత్తగా 26 స్టోర్లు రానున్నాయి. ఇందులో హైదరాబాద్‌తోపాటు విజయవాడ, వైజాగ్, కరీంనగర్ తదితర నగరాలు ఉంథ టాయి. ఒక్కో స్టోర్‌కు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నాం. భారత్‌లో కంపెనీకి 1,500లకుపైగా టచ్ పాయింట్లున్నాయి. 218 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ఏర్పాటు చేశాం. లుథియానాలో ఇటీవలే రూ.80 కోట్లతో స్వెటర్ల తయారీ ప్లాంటు నెలకొల్పాం.