కొండవీడులో ‘ఇస్కాన్’ స్వర్ణ దేవాలయం
* 81 ఎకరాలు కేటాయింపు
* దసరా రోజు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతికి సమీపంలోని కొండవీడులో శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయం నిర్మించాలని తలపెట్టిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్)కు రాష్ట్ర ప్రభుత్వం 81.03 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు ఇస్కాన్‌కు లీజుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరానికి రూ.లక్ష చొప్పున లీజుగా నిర్ణయించింది. రూ.200 కోట్ల వ్యయంతో ఐదు దశల్లో శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తామని ఇస్కాన్ దేవాలయాల దక్షణ భారతదేశ విభాగం అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ బుధవారం ప్రకటిం చిన విషయం విదితమే. ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణానికి దసరా రోజున ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.
తొలి దశలో హంస వాహనంపై శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 16.88 ఎకరాల భూమిని ఇస్కాన్‌కు అప్పగించింది. రెండో దశలో 22.94 ఎకరాల్లో రామలింగేశ్వర ఆలయం, గోవు విశ్వవిద్యాలయం, గోశాలను నిర్మిస్తారు. మూడో దశలో 18.68 ఎకరాల్లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తి వేదాంత ఎడ్యుకేషనల్ సెంటర్, వేదిక్ కళాశాలను నిర్మిస్తారు. నాలుగో దశలో 18.48 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం, భక్తి వేదాం త ఆసుపత్రి, వృద్ధాశ్రమం, అంతర్జాతీయ పాఠశాల, అనాథాశ్రమాలను నిర్మించనున్నారు. ఐదో దశలో వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయం, భోజనశాలలు, అతిథి గృహాలను నిర్మిస్తారు.