‘స్వచ్ఛసంకల్పం’పై డాక్యుమెంటరీ
రంపయర్రంపాలెం (గోకవరం) :
మండలంలోని రంపయర్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం స్వచ్ఛసంకల్పంపై డాక్యుమెంటరీ చిత్రీకరించారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పాఠశాలతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛసంకల్పానికి సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారావు పర్యవేక్షించారు. బృందం సభ్యలకు ఆయన పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గతేడాది డిసెంబర్ 31న జిల్లాలో ప్రతి మండలంలోని ఒక పాఠశాలను స్వచ్ఛ సంకల్పం పాఠశాలగా ఎంపిక చేసి, ఆయా పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికీ పది మంది చొప్పున విద్యార్థులను బృందాలుగా ఎంపిక చేశామన్నారు. వీరితో పాఠశాలలు పని చేయని సమయంలో గ్రామంలో తిరుగుతూ స్వచ్ఛభారత్ గూర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ యేడాది జిల్లాలో 500 పాఠశాలలకు దీనిని విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడంతో ప్రభుత్వం ఈ పాఠశాలలో డాక్యుమెంటరీ తీసేందుకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో గ్రామ దత్తత పార్ట్నర్ బి.సువర్ణకుమార్, డీవైఈఓ ఎస్.అబ్రహాం, ఎంపీడీఓ కె.రత్నకుమారి, ఎంఈఓ కె.ఉదయభాస్కర్చౌదరి, సర్పంచ్ కర్?ర అరుణకుమారి, స్థానిక నాయకులు దొడ్డా విజయ్, రాయవరపు శ్రీనివాసరావు, హెచ్ఎం కోలా సత్యనారాయణ, కార్యదర్శి హనుమంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.