అన్నయ్య ఆర్టీఐ దరఖాస్తు పెట్టాడని...
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని సోదరుడు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశాడనే అక్కసుతో ఆమెపై కాలేజీ యాజమాన్యం కక్ష గట్టిన ఘటన హైదరాబాద్ లో చేసుకుంది.
స్వతంత్ర రెడ్డి అనే విద్యార్థిని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వచ్చే నెలలో ఆమె ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆమెకు కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. హాల్ టిక్కెట్ ఇవ్వకుండా వేధించసాగింది.
ఫీజుల వివరాలు తెలపాలంటూ ఆమె అన్నయ్య అవినాష్ రెడ్డి కొద్దినెలల క్రితం ఆర్టీఐ దరఖాస్తు పెట్టాడు. కాలేజీ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుందంటూ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడి సోదరిపై కాలేజీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. దీంతో అతడు జేఎన్టీయూను ఆశ్రయించాడు. స్వతంత్ర రెడ్డికి హాల్ టిక్కెట్ ఇవ్వాలని గురునానక్ కాలేజీని ఆదేశించామని రిజిస్ట్రార్ రమణరావు తెలిపారు.