నేటితో స్వాతి ఘటనకు ఏడాది
టీనగర్: ప్రేమ పేరిట వెంటాడిన హంతకుడి చేతిలో మహిళా ఇంజినీర్ స్వాతి బలై నేటితో ఏడాది కావస్తోంది. ఈ సంఘటన నగర ప్రజల మనస్సుల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన మహిళా ఇంజినీర్ స్వాతి తెల్లవారుజామున 6.30 గంటలకు విధులకు వెళ్లేందుకు రైలు కోసం వేచియుండగా హంతకుడి కత్తిపోట్లకు బలయ్యారు. పట్టపగలు అనేక మంది ఎదుట కిరాతకంగా ఎలా హత్య జరిగింది? హంతకుడు ఎవరనే విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హత్య జరిగిన మరుసటి రోజు జూన్ 25న రైల్వేస్టేషన్ సమీపంలోగల ఒక సీసీ కెమెరాలో యువకుడు పరారవుతున్న వీడియో దృశ్యాన్ని పోలీసులు విడుదల చేశారు. జూలై రెండవ తేదీన తిరునెల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోగల గ్రామానికి చెందిన రాంకుమార్ అనే ఇంజినీరింగ్ పట్టభద్ర యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు మునుపు అతను బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో సంచలనం ఏర్పడింది. చెన్నైకి తీసుకొచ్చిన రాంకుమార్ ఆస్పత్రిలో చికిత్సలు ముగించుకుని పుళల్ జైలులో నిర్బంధించబడ్డాడు. సెప్టెంబరు 18వ తేదీన జైలులోనే విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముగిసిన కేసు: చార్జిషీటు దాఖలు చేయబడిన ఈ కేసులో హంతకుడు కూడా మృతిచెందినందున కేసు విచారణ ముగిసింది. రాంకుమార్ స్వాతిని వెంబడించి ఆమెను ప్రేమించమని వేధింపులకు గురిచేసినట్లు, ఆమె నిరాకరించడంతో హతమార్చినట్లు విచారణలో తేలింది. ఈ హత్య సంఘటనతో మహిళలకు భద్రత లేదని, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలంటూ పలువురు కోరారు. దీంతో 52 శివారు ప్రాంతాల రైల్వేస్టేషన్లలో నిఘా కెమెరాలు, పోలీసు భద్రత పెంచేందుకు నిర్ణయించారు.
చర్చకు దారితీసిన అనుమానాలు: స్వాతి, రాంకుమార్ ఇరువురూ ఈ ప్రపంచంలో లేనప్పటికీ అనేక అనుమానాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. రాంకుమార్ను అరెస్టు చేసిన చెన్నై పోలీసు కమిషనర్ స్వాతి రాంకుమార్ను తిట్టడంతో హతమార్చినట్లు తెలిపారు. అయితే పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా అతను ఆవిధంగా బదులిచ్చే అవకాశం ఉందా? అనేది సందేహాస్పదమే. పోస్టుమార్టం నివేదిక ఎందుకివ్వలేదు. కేసు ముగిసిన తర్వాత కూడా కేసు ఆధారాలను కోర్టు ఇవ్వడానికి కోర్టు నిరాకరించడానికి కారణం అంటూ పలు ప్రశ్నలున్నాయి.
చిత్రానికి నిషేధం: స్వాతి హత్య కేసు సంఘటన సినిమాగాను నిర్మించారు. స్వాతి కొలై వళక్కు అనే పేరుతో తీసిన ఈ సినిమాలో కొన్ని అనుమానాలను ఆధారాలతోపాటు తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రం విడుదలకు స్టే విధించాలని కోరుతూ స్వాతి తండ్రి డిజిపికి పిటిషన్ అందజేశారు. ఈ చిత్రానికి నిషేధం విధించవచ్చని సమాచారం.