వైజీ మహేంద్రన్ను అరెస్ట్ చేయాలి
తమిళసినిమా: స్వాతి హత్య వ్యవహారంలో మైనారిటీ వర్గాన్ని కించపరచే విధంగా మట్లాడిన నటుడు వైజీ మహేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అస్లామ్ బాషా సోమవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి అనే యువతిదారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందేనన్నారు. అయితే ఆమె హత్యకు కారకులెవరన్నది తెలియక ముందే పలువురు పలురకాల అభిప్రాయాలను ఫేస్బుక్, ట్విట్టర్లలో పోస్ట్ చేశారన్నారు.
అదే విధంగా నటుడు వైజీ.మహేంద్రన్ స్వాతి హత్యా నేపథ్యంలో ఫేస్‌బుక్‌తో కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. అవి మైనారిటీలను అవమానపరచేవిగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు హంతకుడెవరన్నది కనుగొనబడిందన్నారు. దీంతో వైజీ.మహేంద్రన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పుకున్నారనీ, అయితే ఇంతకు ముందు కూడా ఆయన రాజీవ్‌గాంధీపై అనవసరంగా ఆరోపణలు చేసి ఆ తరువాత క్షమాపణ కోరారనీ గుర్తు చేశారు.
ఇలా అసత్య ఆరోపణలు చేస్తూ క్షమాపణలు కోరినా పోలీసులు వైజీ.మహేంద్రన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, లేని పక్షంలో ఆయన ఇంటిని, తను నడిపే నాటక సభను ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా మధురైలోనూ వైజీ.మహేంద్రన్తోపాటు బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. స్వాతి హత్య ఉదంతంలో ఓ వర్గంవారిని హంతకుల సముదాయంగా చిత్రీకరించిన హెచ్.రాజా, నటుడు వైజీ.మహేంద్రన్, ఎస్వీ.శేఖర్‌లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ద్రావిడ విడుదలై సంఘం నిర్వాహకులు మధురై పోలీస్ కమిషనర్ శైలేష్‌కుమార్‌ను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.