అంతర్జాతీయ వైద్యసదస్సుకు మండపేట యువతి
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని నార్త్ - వెస్ట్రన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎండీ చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన యువతి జాస్తి స్వాతిప్రియ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది. గుండె సంబంధిత వ్యాధులపై ఈ నెల 25వ తేదీన స్వీడన్లో జరిగే సదస్సులో వర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. మండపేటకు చెందిన జాస్తి శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె స్వాతిప్రియ 10వ తరగతి వరకూ మండపేటలోను, ఇంటర్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలోను చదువుకుంది.
యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ అండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ వైద్య సదస్సులో యూనివర్సిటీ నుంచి పాల్గొనే అవకాశం స్వాతిప్రియకు లభించింది. 25వ తేదీన స్వీడన్లో జరిగే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ సదస్సుకు తాను ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని స్వాతిప్రియ తెలిపారు. ఆదివారం ఆమె రష్యా నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడి సదస్సుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.