మున్సిపల్ స్వీపర్‌కు ఎంఫిల్‌లో ర్యాంక్
నగర మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సునీల్ యాదవ్ ఇటీవల ప్రతిష్టాకరమైన 'టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్' నుంచి ఎంఫిల్ పట్టా పుచ్చుకున్నారు. ఏకంగా ఇనిస్టిట్యూట్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. ప్రపంచీకరణ- కార్మికుడు' అన్న అంశంపై ఎంఫిల్ చేసిన యాదవ్ సమాజంలో స్వీపర్ల స్థితిగతులపై పీహెచ్డీ చేయాలనుకుంటున్నారు. తనకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని, ఇదే ఉద్యోగంలో చివరివరకు కొనసాగుతానని చెప్పారు.
సమాజంలో వివక్షకు గురవుతున్న స్వీపర్ల లాంటి నిమ్నవర్గాల వారికి అండగా నిలబడాలని, వారికి తగిన గుర్తింపు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని యాదవ్ మీడియాకు తెలిపారు. ఇరుగుపొరుగు వారి ఈసడింపులు, చిన్నచూపును భరిస్తూనే తాను ఎంఫిల్ వరకు చదవగలిగానని ఆయన తెలిపారు. తన తండ్రి మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేశారని, అనారోగ్య కారణంతో ఆయన మంచం పట్టడంతో పదో తరగతి ఫెయిలైన తాను కారుణ్య నియామకం కింద ఈ ఉద్యోగంలో చేరానని చెప్పారు.
సమాజంలో స్వీపర్ ఉద్యోగాన్ని ఎంత చిన్నచూపు చూస్తారో అనుభవ పూర్వకంగా తెలిసి రావడంతో చదువుపై శ్రద్ధ పెట్టానని, ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తయ్యాక, బీకాం, జర్నలిజంలో బీఏ చేశానని తెలిపారు. ఆ తర్వాత సోషల్ వర్క్ పీజీ, ఇప్పుడు ఎంఫిల్ పూర్తి చేశానని ఆయన వివరించారు. ఎంఫిల్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనే ఆలోచన ఏ కోశానా లేదని చెప్పారు. సమాజంలో అన్ని రకాల వివక్షతను ఎదుర్కొంటున్న తన జాతి జనుల పోరాటానికి గళం కావాలన్నదే తన లక్ష్యం, మార్గమని సునీల్ యాదవ్ కృతనిశ్చయంతో చెప్పారు.