’స్మార్ట్ ఏలూరు’కు ఓకే
స్విస్ చాలెంజ్ తరహాలోనే పనులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
స్విస్ చాలెంజ్ తరహాలోనే ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికరవలన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ’ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ కార్పొరేషన్ పేరుతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్ఫూర్తితో రాష్ట్ర్ర ప్రభుత్వం దీనిని చేపట్టిందన్నారు. ఏలూరు నగరపాలక సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా పేర్కొన్నారు. 2029కి మన రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేయడంలో భాగంగా ఈ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఆ ఉత్తర్వుల్లో వివరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయడం, సమగ్ర అభివృద్ధి దిశగా నడపడం లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఆదాయమంతా స్మార్ట్‌కే..
ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. స్మార్ట్ సిటీ పేరిట ప్రైవేటుపబ్లిక్ పార్టనర్ షిప్ పద్ధతిలో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. నగరపాలక సంస్థకు వచ్చే అద్దెలు, పన్నులు, లైసెన్స్ ఫీజులు, యూజర్ చార్జీలు, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా వచ్చే గ్రాంట్లు, రుణాలను పూర్తిగా ఇందుకే వినియోగిస్తారు. ఇంకా అవసరమైతే అప్పులు తెస్తారు. బయటి నుంచి తెచ్చిన రుణాలను 1015 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అమృత్, స్వచ్ఛభారత్ మిషన్, సోలార్ సిటీ మిషన్, డిజిటల్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఐపీడీఎస్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్కిల్ ఇండియా తదితర ప్రాజెక్టుల ద్వారా వచ్చే నిధులను సైతం దీనికి మళ్లిస్తారు. దీని కోసం స్విస్ చాలెంజ్ తరహా విధానాన్ని అవలంబించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఏలూరు అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేసిన షాపూర్జీ పల్లంజీ కంపెనీ లిమిటెడ్ పరిస్థితిని పరిశీలించి ఆమోదించాలని కోరింది. ఇప్పటికే ఎస్పీవీ ఒప్పందం కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా ఎస్పీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉంటారు.