ప్రపంచశాంతికోసం సైకిల్ యాత్ర
గట్టు : ప్రపంచ శాంతిని కోరుతూ నాలుగేళ్లుగా ఓ వ్యక్తి సైకిల్‌యాత్ర కొనసాగిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లా మటమారికి చెందిన ఆగస్టీన్ 2012లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. తలకు హెల్మెట్ పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో పర్యటì స్తూ శుక్రవారం గట్టుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వంద కిలోమీటర్ల దాకా సైకిల్‌పై యాత్ర చేస్తున్నానన్నాడు. ఇప్పటి దాకా 1.2లక్షల కిలోమీటర్లు తిరిగానని, రాయిచూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గట్టులోకి చేరుకున్నానన్నాడు. దేశానికి ఆగస్టులోనే స్వాతంత్య్రం వచ్చినందున తన పేరు ఆగస్టీన్‌గా పెట్టుకున్నట్లు తెలిపాడు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాడు. వైకల్యం ఉన్నా లెక్కచేయకుండా ఓపిక ఉన్నంతవరకు ఈ యాత్రను కొనసాగిస్తానంటున్నాడు. జీవితాంతపు క్యాలెండర్‌ను వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరైనా పుట్టిన తేదీ, సంవత్సరం చెబితే ఏ వారమో ఠక్కున చెబుతున్నాడు. ద్వేషాన్ని వీడి ప్రేమతో జీవనం సాగించే విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆగస్టీన్ విజ్ఞప్తి చేస్తున్నాడు.